Begin typing your search above and press return to search.

ట్రంప్ భారీ సుంకాలకు మోడీ రియాక్షన్ అదేనా ?

ప్రపంచ పెద్దన్న హోదాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సుంకాలను భారీగా పెంచేశారు. అన్ని దేశాలకు తలా ఇంత అని వడ్డించారు.

By:  Tupaki Desk   |   5 April 2025 1:00 PM IST
Narendra modi Silent in Trump Tariffs
X

ప్రపంచ పెద్దన్న హోదాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సుంకాలను భారీగా పెంచేశారు. అన్ని దేశాలకు తలా ఇంత అని వడ్డించారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు నరేంద్ర మోడీ అని అంటూనే భారత్ కి కూడా 27 శాతం వాణిజ్య సుంకాలు పెంచారు. నిజానికి మొదట 26 శాతం అని చెప్పినా దాన్ని మరో శాతం సవరించి మరీ ట్రంప్ మోడీ మీద ప్రేమను అలా చాటుకున్నారన్న మాట.

ఇదే ట్రంప్ మెక్సికో కెనడాలకు మాత్రం చెరి 25 శాతం, అలాగే జపాన్ మలేసియాలకు 24 శాతం విధించారు. మోడీ తన ప్రియమైన స్నేహితుడు అని చెబుతూ ఈ దేశాల కంటే ఎక్కువ సుంకాలు ఎందుకు విధించారో ట్రంప్ కే తెలియాలి. ఆయనకు మంచి నేస్తమైన మోడీకే తెలియాలి అని అంటున్నారు. ఇక చూస్తే కనుక అమెరికాను మంచి మిత్ర దేశంగా భారత్ భావిస్తోంది. అలాగే మోడీ ట్రంప్ ల మధ్య స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే.

అయినా సరే ఏ మాత్రం తగ్గింపు లేకుండా భారీ వడ్డనే చేశారు అని అంటున్నారు. ఈ అధిక సుంకాల వల్ల బంగారం ఆభరణాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి భారత దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు అయ్యే వాటి మీద పెను భారం పడుతుంది

ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల 37 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉన్న భారత దేశం ఇపుడు పెద్ద ఎత్తున వాటిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇలా ట్రంప్ వాణిజ్య సుంకాలు పెంచడం మీద అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశమని చెబుతున్న ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా తీవ్రంగా విమర్శించారు ట్రంప్ అనుసరించిన వైఖరి వల్ల ఆ దేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని కూడా ఆయన ఘాటుగా చెప్పారు.

అలాగే ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో పాటు అనేక ప్రపంచ దేశాల నేతలు ట్రంప్ ది తప్పు అని గట్టిగా అనగలిగారు భారత్ మాత్రం ఎందుకో పెద్దగా రియాక్షన్ ఇవ్వలేదని అంటున్నారు. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల మీద ఈ అధిక సుంకాల భారం పడుతుందని చర్చ ఉంది. అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ లో దిగుమతి చేసుకోవడానికి కూడా అనుమతించాలని ట్రంప్ ప్రభుత్వం కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి.

అదే కనుక జరిగితే రెండిందాలా చెడ్డ అయినట్లుగా ఉంటుందని అంటున్నారు. అమెరికా మిత్ర దేశం అని చెప్పుకోవడానికే తప్ప ట్రంప్ నిజంగా చేసింది ఏమిటి అన్న చర్చ ఉంది. మన వైపు దిగుమతి సుంకాలు తగ్గించమని చెబుతూ అవతల వైపు ఎగుమతి సుంకాలు పెంచుతూ తాను రెండు విధాలుగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా అంతా అంటున్నారు.

ఈ రకమైన చర్యల వల్ల భారత్ లోని కీలకమైన ఆటో మొబైల్ ఇండస్ట్రీ రంగం కూడా దెబ్బ తింటుంది అని అంటున్నారు. ఆ రంగంలో దిగుమతి సుంకాలను మోడీ సర్కార్ కొత్త బడ్జెట్ లో ఇప్పటికే 50 శాతం దాకా తగ్గించినట్లుగా చెబుతున్నారు ఇలా కీలక రంగాలతో పాటు అమెరికా వ్యవసాయ దిగుమతులపైన సుంకాలు తగ్గించడం ద్వారా ఎవరు ఎవరికి నిజమైన మిత్రుడు అన్నది లోకానికి చెబుతున్నారు అన్న చర్చ వస్తోంది.

అమెరికా అధిక వాణిజ్య సుంకాల మీద భారత్ గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే భారత్ అమెరికా కోసమో మరో దేశం కోసమో తన దిగుమతి సుంకాలను తగ్గించుకోవాలసిన అవసరం లేదని అంటున్నారు. ఏ బంధమైన నిలిచి గెలిచేది ఆర్ధిక బంధాలలోనే. అంతా తమ మాటే చెల్లాలని చూస్తున్న అమెరికా పెద్దన్నకు భారత్ బలమైన జవాబు చెబుతుందా లేక సర్దుకుని పోతుందా అన్న దాని మీదనే భారత్ వాణిజ్య రంగం ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ అధిక సుంకాల మీద మోడీ మౌనమే జవాబా అన్నది కూడా విపక్షాల నుంచి ప్రశ్నలు గా వినవస్తోంది.