Begin typing your search above and press return to search.

తగ్గేదేలే... జూలై 9 ఫిక్స్ చేసేసిన ట్రంప్!

అవును.. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల అమలు నిలిపివేత గడువును జులై 9వ తేదీ తర్వాత పొడిగించబోమని ట్రంప్‌ స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 2:30 PM IST
తగ్గేదేలే... జూలై 9 ఫిక్స్ చేసేసిన ట్రంప్!
X

పన్ను విరామం, వ్యయ కోతలతోపాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులను కేటాయించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన 'ఒన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్'ను తీవ్ర ఉత్కంఠ నడుమ శనివారం అర్ధరాత్రి సెనెట్‌ ఆమోదించింది. ఈ హుషారులో ఉన్న ట్రంప్.. సుంకాల అమలు నిలిపివేత గడువు విషయంలో తగ్గేదేలే అని అంటున్నారు!

అవును.. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల అమలు నిలిపివేత గడువును జులై 9వ తేదీ తర్వాత పొడిగించబోమని ట్రంప్‌ స్పష్టం చేశారు. గతంలో ఆయా దేశాలతో చర్చించేందుకు 90 రోజుల సమయమిచ్చామని చెప్పిన ఆయన... తమతో ఒప్పందం చేసుకోని దేశాలపై సుంకాలు అమలవుతాయని తేల్చి చెప్పారు. తమతో వ్యాపారం చేయని దేశాల పేర్లు ప్రకటిస్తామన్నారు.

కాగా... ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించిన 26 శాతం సుంకాలను జూలై 9 వరకు అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే.. 10 శాతం బేస్‌ లైన్ సుంకం ఇప్పటికీ కొనసాగుతుండగా.. అదనపు 26 శాతం సుంకం నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారతదేశం కోరుతోంది. జూలై 8 నాటికి చర్చలు ముగియకపోతే, భారత్ కొత్త సుంకాల ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది!

ఈ నేపథ్యంలోనే... ఫాక్స్ న్యూస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన ట్రంప్.. గడువు పొడిగించే ఆలోచన తనకు లేదని అన్నారు. తాను అలా చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. తాము కొన్ని దేశాలను పట్టించుకోవడం లేదని, అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు.

మరోవైపు... ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని జూలై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో చర్చలను ఖరారు చేయడానికి వాణిజ్య శాఖలో చీఫ్ నెగోషియేటర్, ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం వాషింగ్టన్‌ లో ఉంది.

ఈ క్రమంలో ప్రధానంగా... వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రంగాలను తెరవాలని.. సోయా, గోధుమ, మొక్కజొన్న, ఆపిల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా కోరుతుండగా... వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఔషధాలు, కొన్ని ఇంజనీరింగ్ వస్తువులు వంటి పలు కీలక ఎగుమతులకు జీరో డ్యూటీ యాక్సెస్‌ ను సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.