Begin typing your search above and press return to search.

మరో కోర్టు తీర్పుతో సుంకాలపై ట్రంప్ దే పైచేయి

ట్రంప్ సర్కారు విధించిన సుంకాల అమలును ట్రేడ్ కోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ.. ట్రంప్ సర్కారు అప్పీలు చేసింది.

By:  Tupaki Desk   |   30 May 2025 1:15 PM IST
మరో కోర్టు తీర్పుతో సుంకాలపై ట్రంప్ దే పైచేయి
X

ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ కు.. అదే సమయంలో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తాజా ఉదంతం ఆ కోవలోకే చెందింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించిన ట్రంప్ తీరును ట్రేడ్ కోర్టు వ్యతిరేకించటం.. అక్కడ ట్రంప్ వాదనలకు భిన్నంగా తీర్పు రావటం తెలిసిందే. ఈ కోర్టు తీర్పు ట్రంప్ నకు షాకింగ్ గా మారింది. ఈ తీర్పు వెలువడిన రోజులోనే అందుకు భిన్నమైన తీర్పును అమెరికాలోని మరో కోర్టు ఇవ్వటంతో ఆయన సంతోషానికి హద్దుల్లేకుండా పోయిన పరిస్థితి.

ట్రంప్ సర్కారు విధించిన సుంకాల అమలును ట్రేడ్ కోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ.. ట్రంప్ సర్కారు అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ వినతిని పరిగణలోకి తీసుకొని కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. జూన్ 5 లోపు ఫిర్యాదుదారులు.. జూన్ 9లోపు పాలనాధికారులు స్పందించాలని పేర్కొంది.

లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ.. ఆయన తన అధికార పరిధిని అతిక్రమించినట్లుగా పేర్కొంటూ న్యూయార్క్ లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే వీలు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఈ వాదనల్ని ట్రంప్ ప్రభుత్వం అప్పీలు చేసిన కోర్టు కొట్టివేసింది.

ఇదిలా ఉండగా.. సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించినందుకే భారత్ - పాక్ లు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనల్ని భారత్ తోసిపుచ్చింది అసలు నాటి చర్చల్లో సుంకాల ప్రస్తావనే రాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించిన మే 7 నుంచి కాల్పుల విరమణకు ఓకే చేసిన మే 10 మధ్యలో భారత్ - అమెరికా మధ్య చాలా సందర్భాల్లో చర్చలు జరిగాయని.. కానీ ఎప్పుడూ సుంకాల వ్యవహారం తమ మధ్యలోకి రాలేదని భారత ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ వెల్లడించారు.