Trump: నాడు బైడెన్ విమర్శించిన ట్రంప్ కు అదే పరిస్థితి.. నెటిజన్ల ట్రోలింగ్
గతంలో బైడెన్ విమానం ఎక్కుతూ తడబడినప్పుడు ట్రంప్ అపహాస్యం చేసిన తీరును గుర్తు చేస్తూ వరుస పోస్టులు చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2025 5:19 PM ISTTrump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగు తడబడింది. విమానం ఎక్కుతుండగా ఆయన కాస్త తూలారు. ఈ దృశ్యాలను షేర్ చేస్తూ నెటిజన్లు గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇలాగే తడబడినప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ నుండి విమానం ఎక్కుతుండగా, ట్రంప్ మెట్లపై పొరపాటున అడుగు తడబడి తూలారు. అయితే, ట్రంప్ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా తూలడం గమనార్హం.
నెటిజన్ల ట్రోలింగ్
ఈ దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతంలో బైడెన్ విమానం ఎక్కుతూ తడబడినప్పుడు ట్రంప్ అపహాస్యం చేసిన తీరును గుర్తు చేస్తూ వరుస పోస్టులు చేస్తున్నారు. ఒక నెటిజన్ మాట్లాడుతూ, ఇప్పుడు ట్రంప్ స్థానంలో బైడెన్ ఉండుంటే, టీవీ ఛానెళ్లలో ఇప్పటికే 'బ్రేకింగ్ న్యూస్' వచ్చి ఉండేదని చమత్కరించారు. మరొక నెటిజన్ స్పందిస్తూ, ట్రంప్ కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు కాబట్టి, ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడు అని తాను భావిస్తున్నానని అన్నారు. ఇంకొక నెటిజన్ "గతంలో బైడెన్ ఇలా తడబడినప్పుడు రోజుల తరబడి ఆయన వీడియోను పదేపదే చూపించిన ట్రంప్ మీడియా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది?" అని ప్రశ్నించారు.
గతంలో బైడెన్ తడబాటు
2021లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమం తర్వాత బయలుదేరడానికి విమానం వద్దకు వచ్చారు. ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతుండగా వరుసగా మూడుసార్లు జారిపడ్డారు. 2024లో కూడా ఇదే మాదిరిగా విమానం ఎక్కుతూ తడబడ్డారు. ఆ సమయంలో ట్రంప్ బైడెన్‌ను విమర్శిస్తూ, ఆయన వృద్ధాప్య సమస్యలు పెరుగుతున్నాయని, జ్ఞాపకశక్తి కూడా క్షీణిస్తోందని అన్నారు. అలాంటి వ్యక్తి అమెరికాను ఎలా ముందుకు తీసుకెళ్తాడు అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ట్రంప్‌కు కూడా అదే పరిస్థితి ఎదురవడంతో ఆయనపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
