Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ కు ఆ విషయంలో హ్యాండిచ్చిన ట్రంప్... తెరపైకి కీలక కారణం!

సుమారు మూడేళ్లుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 July 2025 10:47 AM IST
ఉక్రెయిన్  కు ఆ విషయంలో హ్యాండిచ్చిన ట్రంప్... తెరపైకి కీలక  కారణం!
X

సుమారు మూడేళ్లుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమంటూ ఇటీవల పుతిన్ ప్రకటించారు. అయితే.. ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేది తెలియదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు ట్రంప్ బిగ్ షాకిచ్చారు.

అవును.. రష్యాతో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ కు ఓ బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఇందులో భాగంగా.. ఇప్పటివరకూ భారీగా ఆయుధ సాయం చేస్తోన్న అమెరికా తాజాగా గట్టి షాకిచ్చింది. ఉక్రెయిన్ కు అవసరమైన కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెంటగాన్ అధికారులు ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన రక్షణ శాఖ... ఈ ఆయుధాలను ఉక్రెయిన్‌ కు అందించడానికి గతంలో బైడెన్‌ ప్రభుత్వం అంగీకరించిందని.. అయితే, ఇటీవల తమ ఆయుధ నిల్వలను సమీక్షించిన తర్వాత.. ఉక్రెయిన్ కు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయుధాల నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించి.. ఇకపై పంపించొద్దని నిర్ణయించినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్ అధికార ప్రతినిధి అన్నా కేలీ... తమ సొంత అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు ఆయుధ సాయం చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే... ఉక్రెయిన్ కు అమెరిక నిలిపివేసిన ఆ ఆయుధాల వివరాలను అటు వైట్ హౌస్ కానీ, ఇటు రక్షణ శాఖ కానీ వెల్లడించలేదు.

కాగా... రష్యా - ఉక్రెయిన్‌ మధ్య గత మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ఇటీవల మరింత తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి.

మరోవైపు.. 2022 ఫిబ్రవరిలో రష్యాతో పోరు ప్రారంభమైన నాటినుంచి అమెరికా ఇప్పటివరకు కీవ్‌ కు 66 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ, సైనిక సాయాన్ని అందజేసిందని అంటున్నారు. ఇంత సడన్ గా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం కూడా ఒక కారణమని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా 11 రోజుల్లోనే అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థల్లో సుమారు 15-20 శాతం వినియోగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. ఉక్రెయిన్ కు హ్యాండ్ ఇచ్చారు ట్రంప్ అని అంటున్నారు.