అల్లుడి కోసం ‘నెట్ ఫ్లిక్స్-వార్నర్ బ్రదర్స్’కు ఎసరు పెట్టిన ట్రంప్
మీడియా రంగంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
By: A.N.Kumar | 9 Dec 2025 3:34 PM ISTఎక్కడ బొక్క కనపడుతుందో అందులో దూరిపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్ లో మినరల్స్ ఉన్నాయనగానే భారత్ తో మోడీతో దోస్తీ కటీఫ్ చేసి పాకిస్తాన్ లోకి తన కుమారుడు, అల్లుడిని పంపి అక్కడ దోచుకునే పనిలో పడ్డారు. అంతటితో ఆగారు ఇప్పుడు మీడియా రంగంలోనే అతిపెద్ద ఎంటర్ టైన్ మెంట్ డీల్ అయిన ‘నెట్ ఫ్లిక్స్-వార్నర్ బ్రదర్స్ ’లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు.
మీడియా రంగంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. భారీ మీడియా దిగ్గజంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న నెట్ ఫ్లిక్స్ ఆశలకు గండి కొడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో అనుబంధం ఉన్న పారా మౌంట్ స్వైడ్యాన్స్ సంస్థ అనూహ్యంగా రంగంలోకి దిగింది. ఏకంగా 108.4 బిలియన్ డాలర్ల విలువైన ‘హాస్టైల్ బిడ్’ వేయడం హాట్ టాపిక్ గా మారింది. అంటే నెట్ ఫ్లిక్స్ కు వార్నర్ బ్రదర్స్ డీల్ పోకుండా ట్రంప్ చేజిక్కించుకునే స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ టీవీ , సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విబాగాలను కొనుగోలు చేసేందుకు గత కొద్ది వారాలుగా నెట్ ఫ్లిక్స్, కామ్ కాస్ట్ కార్పొరేషన్ , పారా మౌంట్ వంటి దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ఈ బిడ్డింగ్ యుద్ధంలో చివరకు 72 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.48 లక్షల కోట్ల) ఒప్పందంతో నెట్ ప్లిక్స్ వైపు డిస్కవరీ మొగ్గు చూపింది. నెట్ ప్లిక్స్ ఈ తాత్కాలిక ఒప్పందం కింద ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేర్ కు 28 డాలర్లను చెల్లించడానికి సిద్ధమైంది. అయితే ఈ ఒప్పందానికి గండికొడుతూ..పారా మౌంట్ సంస్థ ఏకంగా 108.4 బిలియన్ డాలర్ల భారీ బిడ్ వేసింది. ఇది ఒక్కో షేరుకు 30 డాలర్ల చొప్పున చెల్లించేందుకు ప్రతిపాదించింది. ఈ బిడ్ వెనుక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు అయిన జేర్డ్ కుష్నర్ నేతృత్వంలోని అఫినిటీ పార్టనర్స్ ఉన్నట్టుగా వాసింగ్టన్ పోస్ట్ కథనం ద్వారా వెల్లడైంది. ఈ పరిణామం నెట్ ఫ్లిక్స్ డీల్ పై తీవ్ర సందేహాలకు తావిస్తోంది.
పారా మౌంట్ వేసిన 108.4 బిలియన్ డాలర్ల బిడ్ ను హాస్టైల్ బిడ్ అని పిలుస్తారు. సాధారణంగా ఒకసంస్థ మేనేజ్ మెంట్ విక్రయ ప్రతిపాద ప్రతిపాదనకు అనుకూలంగా లేనప్పుడు ఆ సంస్థను కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా వాటాదారులను లక్ష్యంగా చేసుకొని ఈ రకమైన బిడ్ ను వేస్తారు. పారా మౌంట్ ప్రతిపాదనలు గత సెప్టెంబర్ నుంచే వార్నర్ బ్రదర్స్ నుంచి తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పారామౌంట్ నేరుగా వాటాదారులను లక్ష్యంగా చేసుకొని నగదు రూపంలో కొనుగోలు మొత్తాన్ని అందిస్తానని ప్రకటించింది.
ఇక నెట్ ఫ్లిక్స్ , వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్యలోకి ట్రంప్ ఎంట్రీ ఇచ్చి పుల్లలు పెట్టారు. వీళ్ల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేయడం కూడా ఈ వ్యవహారంలో అడ్డంకులను సృష్టిస్తోంది. ఈ పరిణామాలు ఒక వైపు పారామౌంట్ నుంచి అధిక బిడ్ రూపంలోనూ.. మరో వైపు ట్రంప్ నుంచి బెదిరింపులుగా నెట్ ఫ్లిక్స్ డీల్ కు సవాళ్లు విసురుతున్నాయి. మీడియా రంగంలో పట్టు పెంచుకోవాలని భావించిన నెట్ ఫ్లిక్స్ ఆశలు ఈ పోటీ కారణంగా గందరగోళంలో పడ్డాయి.
