కృతజ్ఞత లేని ఇరాన్ పై మళ్లీ దాడులు... ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ గ్యాప్ లో ఇరాన్ కు తమ్ముడులాంటి హెజ్ బొల్లాను లెబనాన్ లో గుల్ల చేసేస్తుంది ఇజ్రాయెల్. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 29 Jun 2025 11:29 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముగిసినట్లే అనిపిస్తుంది కానీ.. అది తెరవెనుక నివురుగప్పిన నిప్పులా ఉందని.. అది ఏ క్షణమైనా బరస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో ఇరాన్ కు తమ్ముడులాంటి హెజ్ బొల్లాను లెబనాన్ లో గుల్ల చేసేస్తుంది ఇజ్రాయెల్. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం ముగిసిన రెండు రోజుల తర్వాత స్పందించిన అయతుల్లా అలీ ఖమేనీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అమెరికాపైనా, మోసపూరిత జియోనిస్ట్ పాలనపైనా విజయం సాధించినందుకు ఇరాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
అలా చేయకపోతే జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించి, అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి ప్రవేశించిందని.. అయితే, ఈ యుద్ధం నుండి అది ఏమీ సాధించలేదని అన్నారు. ఈ యుద్ధంలో ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధించిందని.. కీలకమైన అమెరికా స్థావరాలలో ఒకటైన అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించిందని వెల్లడించారు.
ఇలా చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. విద్వేషంతో కూడిన ఖమేనీ ప్రకటన చూసిన తర్వాత ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలు సడలించాలన్న ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. ఇరాన్ తన అణుకార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తే ఆ దేశంపై బాంబులు వేయడానికి తాను వెనుకాడబోనని హెచ్చరించారు.
ఇదే సమయంలో... యుద్ధంతో నాశమైన దేశానికి సుప్రీం నేతైన ఖమేనీ, ఇజ్రాయెల్ పై నెగ్గానని మూర్ఖంగా మాట్లాడుతున్నారని.. అది అబద్ధమనే విషహ్యం ఆయనకూ తెలుసని.. ఆ దేశం నాశనమైపోయిందని.. మూడు రాక్షస అణుకేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయని.. యుద్ధ సమయంలో ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తనకు తెలుసని ట్రంప్ పేర్కొన్నారు.
ఆ సమయంలో... ఇజ్రాయెల్, అమెరికా సైనిక దళాలు ఆయన్ను హతమార్చకుండా తాను అడ్డుకున్నానని.. ఆ దాడుల్లో ఆయన నీచమైన చావు చావకుండా తాను రక్షించానని.. అయినప్పటికీ ఖమేనీ నాకు ధన్యవాదాలు చెప్పలేదని ట్రంప్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో పోస్ట్ పెట్టారు.
