Begin typing your search above and press return to search.

'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'కు ఆమోదం.. ట్రంప్ కలల బిల్లు ఆమోదంలోకి..

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో ఇది అమెరికా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

By:  Tupaki Desk   |   5 July 2025 9:38 AM IST
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం.. ట్రంప్ కలల బిల్లు ఆమోదంలోకి..
X

ట్రంప్ ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ ఇప్పుడు చట్టంగా అమల్లోకి వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో ఇది అమెరికా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. పన్నుల కోతలు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, సరిహద్దు భద్రతలో పెట్టుబడులు వంటి కీలక అంశాలతో రూపొందించిన ఈ బిల్లును రిపబ్లికన్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది.

- సెనెట్, ప్రతినిధుల సభలో ఉత్కంఠభరిత ఆమోదం

ఈ బిల్లు అమెరికా సెనెట్‌లో సుదీర్ఘ చర్చలకు దారితీసింది. ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ 51-50 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్‌గా కీలక ఓటు వేయడం గమనార్హం. ఆ తర్వాత ప్రతినిధుల సభలో కూడా 218-214 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఇక్కడ కూడా ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు.

-చట్టంపై ట్రంప్ స్పందన

బిల్లుపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ "ప్రజలు ఇంత సంతోషంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది అమెరికాకు ఒక అద్భుతమైన రోజు. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ లాభం కలుగుతుంది. మిలిటరీ నుంచి మొదలుకొని కార్మికుల వరకూ అందరికీ ఇది మేలు చేస్తుంది" అన్నారు. ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థునెలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. "ఈ చట్టంతో పన్నుల్లో అతిపెద్ద కోత, వ్యయాల నియంత్రణ, సరిహద్దు భద్రతలో భారీ పెట్టుబడి ప్రభుత్వ వ్యయనియంత్రణలో కీలకంగా నిలుస్తాయి" అని స్పష్టం చేశారు.

- వైట్‌హౌస్‌లో వేడుకలు

ఈ చట్టంపై సంతకం చేయడం ఒక రాజకీయ వేడుకలా మారింది. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్ష నేతలు, మిలిటరీ కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో విన్యాసాలు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాయి.

-బిల్లులోని ప్రధాన అంశాలు

* పన్నుల్లో భారీ కోతలు

*ప్రభుత్వ వ్యయాలపై నియంత్రణ

*సరిహద్దు భద్రత కోసం నిధుల కేటాయింపు

*వలస చట్టాల అమలుకు కఠిన విధానాలు

*కొన్ని తాత్కాలిక పన్ను మినహాయింపులను శాశ్వతం చేయడం

ఒకవైపు ఈ బిల్లును రిపబ్లికన్ శిబిరం అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునాది రాయిగా అభివర్ణిస్తుండగా, మరోవైపు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఈ బిల్లుతో లక్షలాది మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోతారని హెచ్చరికలు వస్తున్నాయి. పన్నుల కోతల వల్ల కొన్ని ప్రభుత్వ సేవలు తగ్గే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులపై దీని ప్రభావం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ చట్టం ట్రంప్ పాలనలో ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.