భారీ నిరసనల వేళ గోల్ఫ్ ఆడిన ట్రంప్... 'క్లబ్' ప్రచారం కోసమేనా?
అవును... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం స్కాట్లాండ్ లోని తన 'ట్రంప్ టర్న్ బెర్రీ గోల్ఫ్ రిసార్ట్'లో భారీ భద్రత మధ్య.. తన తనయుడు ఎరిక్ తో కలిసి గోల్ఫ్ ఆడారు. ఇది ట్రంప్ సొంత గోల్ఫ్ క్లబ్.
By: Tupaki Desk | 27 July 2025 12:05 PM ISTరెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ఇంటా బయటా వ్యతిరేకత ఎక్కువగా పెరుగుతున్న ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఓ పక్క వందలాదిమంది నిరసన ప్రదర్శన కొనసాగిస్తుండగా.. మరోపక్క ఆయన గోల్ఫ్ ఆడారు. ఇది కేవలం తన సొంత గోల్ఫ్ ప్రచారం కోసమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అవును... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం స్కాట్లాండ్ లోని తన 'ట్రంప్ టర్న్ బెర్రీ గోల్ఫ్ రిసార్ట్'లో భారీ భద్రత మధ్య.. తన తనయుడు ఎరిక్ తో కలిసి గోల్ఫ్ ఆడారు. ఇది ట్రంప్ సొంత గోల్ఫ్ క్లబ్. దీన్నీ ట్రంప్ ఫ్యామిలీ 2008లో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తండ్రీ కొడుకులతో పాటు బ్రిటన్ లోని యూఎస్ రాయబారి వారెన్ స్టీఫెన్స్ కూడా గోల్ఫ్ ఆడారు.
బ్రిటన్ - అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఒకపక్క వందలమంది నిరసనకారులు ఎడిన్ బరోలోని అమెరికా కాన్సులేట్ ఎదుట ప్రదర్శనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు ఆయన గోల్ఫ్ ఆడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సొంత గోల్ఫ్ రిసార్టుల ప్రచారం కోసమే ట్రంప్ ఈ పర్యటన చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ట్రంప్ బ్రిటన్ పర్యటన సెప్టెంబరులో జరగాలి.
అయితే... సొంత గోల్ఫ్ క్లబ్బుల మార్కెటింగ్ కోసం అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని వైట్ హౌస్ మాజీ ఉద్యోగి, న్యాయవాది రిచర్డ్ పెయింటర్.. ట్రంప్ పై మండిపడ్డారు. మొత్తంగా స్కాట్లాండ్ పర్యటనకు 38 లక్షల డాలర్లు ఖర్చు కానున్నట్లు కథనాలొస్తున్నాయి. ఆయన ఉపయోగించే 'ఎయిర్ ఫోర్స్ వన్' విమాన ప్రయాణానికి గంటకు సుమారు రూ.2.3కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు.
స్కాట్లాండ్ అంతటా సామూహిక నిరసనలు!:
ఎడిన్ బర్గ్ లోని యుఎస్ కాన్సులేట్ వెలుపల, అబెర్డీన్ యూనియన్ టెర్రస్ వద్ద ప్రదర్శనలు ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది నిరసనకారులు ట్రంప్ వ్యతిరేక బ్యానర్లు, పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా... "ట్రంప్, ట్రంప్, ట్రంప్.. అవుట్, అవుట్, అవుట్"... "స్కాట్లాండ్ ప్రజలు మిమ్మల్ని బయటకు పంపాలని కోరుకుంటున్నారు" అని నినాదాలు చేశారు.
వలసలపై షాకింగ్ కామెంట్స్!:
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఐరోపాలో వలస విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఐరోపాను వలసల ప్రవాహం నాశనం చేస్తోందని.. వ్యవస్థను సరిచేసుకోకపోతే ఇక ఐరోపా మిగలదని అన్నారు. కాగా... ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్, తల్లి మేరీ ఆన్ మెక్ లియోడ్ ఇద్దరూ యూరప్ నుంచే అమెరికాకు వలస వచ్చిన సంగతి తెలిసిందే!
