Begin typing your search above and press return to search.

'వారికి అంత సీన్ లేదు'... ఇజ్రాయెల్ పై ట్రంప్ డైలాగులు!

న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్... ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని..

By:  Tupaki Desk   |   21 Jun 2025 10:47 AM IST
వారికి అంత సీన్  లేదు... ఇజ్రాయెల్  పై ట్రంప్  డైలాగులు!
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ ఈ యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన నెతన్యాహు.. ఇరాన్ లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసే విషయంలో అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమన్నారు.

ఇదే సమయంలో.. ఇరాన్ లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా... ఇజ్రాయెల్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి అంత సీన్ లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు.

అవును... ఇరాన్ లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసే విషయంలో అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని.. వాటిపై తాము దాడులు చేసి, నాశనం చేయగలమని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. తమ సాయం లేకుండా 'ఫోర్డ్‌' లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌ కు లేదని అన్నారు.

న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్... ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని.. అయితే, అమెరికా సాయం లేకుండా ఇరాన్‌ కు చెందిన ఫోర్డ్‌ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం మాత్రం వారికి లేదని అన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అవి పెద్ద ప్రభావం ఏమీ చూపించవని తెలిపారు.

ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ట్రంప్.. ఇరాన్ పై సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్‌ ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమని స్పష్టం చేశారు. గెలుస్తున్న సమయంలో ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తెలిపారు. ఈ యుద్ధంలో టెల్‌ అవీవ్‌ అద్భుతమైన దాడులు చేస్తుండగా.. టెహ్రాన్‌ మాత్రం తేలిపోయిందని తెలిపారు

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను డొనాల్డ్ ట్రంప్‌ తోసిపుచ్చారు. ఇరాన్ యూరప్‌ తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నారని వెల్లడించారు.