Begin typing your search above and press return to search.

మూర్ఖుడి మాటలకు బదులు ఇవ్వాలా కాంగ్రెస్?

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. దాని ప్రభావం వేరే లెవల్ లో ఉండేది. ఇప్పుడు అదంతా పోయి చాలాకాలమే అయ్యింది.

By:  Tupaki Desk   |   22 May 2025 8:00 PM IST
మూర్ఖుడి మాటలకు బదులు ఇవ్వాలా కాంగ్రెస్?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటోడు? అన్న మాటను ప్రపంచంలో ఎవరిని అడిగినా వచ్చే సమాధానం.. మూర్ఖుడు.. మొండోడు.. తెలివితక్కువ వాడు.. ఒళ్లంతా తలతిక్కతనం ఉన్న వ్యక్తి లాంటి మాటల్లో ఏదో ఒక మాట అయితే చెబుతారు. ట్రంప్ పుణ్యమా అని అమెరికా అధ్యక్ష పదవికి ఉండే మర్యాద.. గౌరవం తగ్గిపోయి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. దాని ప్రభావం వేరే లెవల్ లో ఉండేది. ఇప్పుడు అదంతా పోయి చాలాకాలమే అయ్యింది.

రోజుకో మాటతో ఇష్టారాజ్యంగా.. బాధ్యత లేకుండా మాట్లాడే వ్యక్తి మాటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత? అతడెప్పుడు ఏ అంశం గురించి మాట్లాడతారో ఆయనకు కూడా తెలీదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత నాయకత్వంలో ఇప్పటివరకు కామెడీ పీస్ కనిపించదు. ఆ కొరత తీర్చేశారు ట్రంప్. ఆపరేషన్ సిందూర్ ఎపిసోడ్ కు సంబంధించిన భారత్ - పాక్ మధ్య చర్యలకు తానే కారణమని.. తాను చెప్పిన మాటలకు.. ఇచ్చిన హెచ్చరికలతోనే రెండు దేశాలు దారికి వచ్చి.. బుద్దిగా నడుచుకున్నట్లుగా బిల్డప్ ఇవ్వటం తెలిసిందే.

తాను చొరవ తీసుకున్న కారణంగానే రెండు దేశాల మధ్య అణుయుద్ధ ముప్పు తొలగినట్లుగా పేర్కొంటూ.. అందుకు తనకు తానే క్రెడిట్ ఇచ్చుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదని.. మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అదే పనిగా భారత్ - పాక్ మధ్య యుద్ధానికి సంబంధించి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రధాని సమాధానం చెప్పాలని రెట్టిస్తోంది.

కాంగ్రెస్ విమర్శల్ని చూసినప్పుడు కాస్తంత విస్మయానికి గురి కాక తప్పదు. ఎందుకంటే.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే ట్రంప్ లాంటి అధినేత మాటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత? అన్నది ముఖ్యం. ఒకవేళ కాంగ్రెస్ చెప్పినట్లే.. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారనే అనుకుందాం. దానికి బదులుగా ఏం జరుగుతుంది? మోడీ వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇవ్వకుండా ఉంటారా? మోడీ మీద కోపం.. భారత్ మీదకు మారితే నష్టం ఎవరికి? పిచ్చాడి చేతిలో రాయి ఉన్నప్పుడు.. వాడి ఎదురుగా ఉన్నోడు ఎంత పోటుగాడు ఉన్నా ఏం చేస్తాడు? అప్పుడు తనకున్న బలం కంటే కూడా బుద్ధిని ఉపయోగిస్తాడు.

ఎందుకంటే.. పిచ్చాడి చేతిలో ఉన్న రాయి ఏమైనా చేస్తుంది? అలాంటప్పుడు అవసరానికి మించిన శక్తిని ఉపయోగించి రాయిని ఎదుర్కోవటమా? బుద్ధి బలంతో ఎంత స్పందించాలో అంత స్పందించటమే మంచిది అవుతుంది. తెలివైనోళ్లు ఎవరైనా ఇదే చెబుతారు. ఇప్పుడు ట్రంప్ విషయాన్నే తీసుకుందాం. భారత్ - పాక్ కు సంబంధించి ట్రంప్ చేసే వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పోతే.. జరిగేదేమిటి? ఇష్యూ డైవర్టు కావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకు భిన్నంగా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించటానికి మించిన మంచి పని ఇంకేం ఉంటుంది?

ఈ కోణంలో చూసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. మోడీ మౌనం వ్యూహాత్మకమైనదే తప్పించి ఇంకేమీ కాదన్న వాస్తవం నిదానించి ఆలోచించే వారికి అర్థమవుతుంది తప్పించి.. ఆవేశంతో మాట్లాడే వారికి కాదు. ఇలాంటప్పుడు కాంగ్రెస్ చేసే విమర్శల గురించి ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదన్న నిజం అర్థమవుతుంది. కాదంటారా?