దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ ని కుర్చోబెట్టి కడిగేసిన ట్రంప్!
తాజాగా వైట్ హౌస్ లో భేటీ నేపథ్యంలో రామఫోసా, డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతీయులపై జరుగుతున్న మారణహోమం గురించి ట్రంప్ ప్రస్థావించారు.
By: Tupaki Desk | 22 May 2025 4:03 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో దక్షిణాఫ్రియా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా భేటీ నేపథ్యంలో.. వైట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్యంపై కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవాలనే ఆశతో తన పక్కనే కూర్చున్న సిరిల్ రామఫోసా ను ప్రూఫులు చూపిస్తూ ఆకస్మిక దాడి చేశారు ట్రంప్.
అవును... తాజాగా వైట్ హౌస్ లో భేటీ నేపథ్యంలో రామఫోసా, డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతీయులపై జరుగుతున్న మారణహోమం గురించి ట్రంప్ ప్రస్థావించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ప్రదర్శించిన ట్రంప్.. పలు ఫోటోలు చూపిస్తూ సిరిల్ పై మాటల తూటాలు పేల్చారు.
ఈ సందర్భంగా ఓ వీడియోను ట్రంప్ ప్లే చేయగా.. అందులో దక్షిణాఫ్రికా నాయకుడు లీజియస్ మాలేమా మాట్లాడుతూ కనిపించారు. ఈ సందర్భంగా... దేశంలో ఉన్న 4.5 మిలియన్ల శ్వేత జాతీయులను అంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. ఇది చాలా భయంకరమైన దృశ్యమని.. తాను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని అన్నారు.
దీనిపై స్పందించిన సిరిల్ రామఫోసా... ఆ వీడియోలోని వారు ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నారో మీరు చూశారని.. ఇది తమ ప్రభుత్వ విధానం కాదని.. తమ ప్రభుత్వ విధానం ఆయన చెప్పేదానికి పూర్తి వ్యతిరేకమని అన్నారు. ఇదే సమయంలో.. ఈ వీడియోను తాను చూడలేదని.. దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అనంతరం తెల్ల జాతీయులైన రైతుల భూములను లాక్కోవడం పైనా వీరు చర్చించారు. ఈ సందర్భంగా ఆ వీడియోతో పాటు తెల్ల రైతులపై దాడులకు సంబంధించిన నివేదికల ప్రింట్ అవుట్ లను ట్రంప్.. రాంఫోసాకు చూపించారు. ఇది భయంకరమైన మరణమని అన్నారు. వీరు భయంకరమైన వివక్ష, హింసను ఎదుర్కొంటున్నారని చెప్పారు.
