జర్నలిస్టుపై ట్రంప్ చిందులు... ఎందుకొచ్చింది అంత ఆగ్రహం?
తాజాగా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాతో ట్రంప్ భేటీ నేపథ్యంలో వైట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
By: Tupaki Desk | 22 May 2025 2:00 PM ISTఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మిడిల్ ఈస్ట్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందే.. విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇస్తామని ఖతార్ పాలక ఫ్యామిలీ ప్రకటించింది. దీన్ని ట్రంప్ స్వీకరించారు. ఈ విమానం ట్రంప్ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది.
అయితే.. అధ్యక్షుడి సురక్షిత వినియోగానికి తగ్గట్లుగా ఈ విమానంలో తగిన సెక్యూరిటీ ఛేంజెస్ తమ శాఖ కసరత్తు చేస్తోందని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెంట్ పేర్కొన్నారు. 2029 జనవరిలో పదవీకాలం ముగిసేవరకూ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ కు కొత్త వెర్షన్ గా దీన్ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో.. దీని గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై ఫైర్ అయ్యారు ట్రంప్.
అవును... తాజాగా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాతో ట్రంప్ భేటీ నేపథ్యంలో వైట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఖతార్ పాలకులు అమెరికాకు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇచ్చిన విషయంపై విలేకరి ఒకరు ట్రంప్ ను ప్రశ్నించారు. దీంతో... ట్రంప్ ఒక్కసారిగా చిందులు తొక్కారు.
ఇందులో భాగంగా... దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస, తదితర సమస్యల గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? వాటి నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావ్! నీకు విలేకరిగా విధులు నిర్వహించే అర్హత లేదు.. నువ్వు తెలివితక్కువవాడివి.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఫైర్ అయిపోయారు.
ఇదే సమయంలో.. అసలు తాము మాట్లాడుతున్నదానికి ఖతర్ విమానానికి సంబంధం ఏమిటి? వాళ్లు విమానం ఇచ్చారు.. అది చాలా గొప్ప విషయం.. అయితే, అది ఇప్పుడు ప్రశ్నించే సమయమా? అని మండిపడుతూ.. అతనితో పాటు ఆ వార్తా సంస్థపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. దీనిపై విచారణ జరపాల్సి ఉందని అన్నారు.
