ఫ్రీగా ఫ్లైట్ వస్తే వద్దంటానా? చరిత్రలో మరే అమెరికా అధ్యక్షుడు ఇలా అనడేమో?
ఈ వారంలోమధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా ఖతార్ కు వెళుతున్న ట్రంప్ కు.. ఆ దేశ రాజ కుటుంబం విలాసవంతమైన 747-8 జెట్ విమానాన్ని బహుమతిగా ఇవ్వనుంది.
By: Tupaki Desk | 13 May 2025 2:24 PM ISTఅత్యున్నత స్థానాల్లో ఉండి కక్కుర్తితో వ్యవహరించటం చాలా అరుదుగా చూస్తుంటాం. అందునా ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికాకు అధ్యక్షుడు కావటానికి మించిన గొప్పేం ఉంటుంది. మిగిలిన అమెరికా అధ్యక్షులకు ట్రంప్ కు ఒక తేడా ఉంది. ఆయన చాలామంది అమెరికా అధ్యక్షుల కంటే కూడా సంపన్నుడు. బేసిగ్గా ఆయనో వ్యాపారవేత్త. అలాంటి బడా వ్యాపారవేత్తకు రెండుసార్లు అమెరికాకు అధ్యక్షుడు కావటం ఒక ఎత్తు అయితే.. ఆ స్థాయికి తగ్గట్లు వ్యవహరించకుండా కక్కుర్తి మాటలు మాట్లాడటం ఆయనకే సొంతమని చెప్పాలి.
ఈ వారంలోమధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా ఖతార్ కు వెళుతున్న ట్రంప్ కు.. ఆ దేశ రాజ కుటుంబం విలాసవంతమైన 747-8 జెట్ విమానాన్ని బహుమతిగా ఇవ్వనుంది. దీన్ని స్వీకరించేందుకు ట్రంప్ సైతం ఓకే చెప్పేయటం తెలిసిందే. సాధారణంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి ఖరీదైన.. విలువైన బహుమతులు ఇవ్వటం మామూలే అయినప్పటికీ.. ఇంతటి విలువైన బహుమతి ఇటీవల కాలంలో ఇవ్వటం ఇదే తొలిసారి అవుతుంది.
ఒక దేశాధ్యక్షుడికి మరో దేశ రాజ కుటుంబం అత్యంత విలాసవంతమైన విమానాన్ని గిఫ్టురూపంలో ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వీటిని ట్రంప్ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఖతార్ అమెరికా అధ్యక్షుడికి ఇంత ఖరీదైన బహుమతిని ఇస్తుందన్నది ఇప్పుడో ఫజిల్ గా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా వైట్ హౌస్ వద్ద ఇదే అంశాన్ని మీడియా ప్రతినిధులు ట్రంప్ ను ప్రశ్నించగా ఆయన నుంచి వచ్చిన సమాధానం విన్నోళ్లు విస్తుపోయే పరిస్థితి.
ఈ బహుమతి ద్వారా ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఏమైనా లబ్థి పొందనుందా? భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా? అని ప్రశ్నించగా.. ‘‘నేను ఇలాంటి ఆఫర్ ను ఎప్పటికి తిరస్కరించను. ఉచితంగా ఖరీదైన విమానాన్ని ఇస్తున్నప్పుడు వద్దనటానికి నేనేమైనా తెలివితక్కువ వాడినా?’’ అంటూ ఇచ్చిన ఆన్సర్ అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ట్రంప్ స్థాయికి.. ఎంతటి ఖరీదైన బహుమతి కూడా ఒక పెద్ద విషయం కాదు. ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోనే అత్యుత్తమ లోహ విహంగమైన ఎయిర్ ఫోర్సు వన్ ను వాడుతుంటారు. అలాంటప్పుడు ఖతార్ రాజ కుటుంబం బహుమతిగా ఇస్తున్న జంబో జెట్ విమానాన్ని ఎయిర్ ఫోర్సు వన్ తగ్గట్లు కొన్ని మార్పులు చేసి వాడతారని చెబుతున్నారు.
ఇది భద్రతా పరమైన సమస్యల్ని తీసుకురాదా? అంటూ ప్రశ్నించటం ట్రంప్ నకు నచ్చలేదు. అంతేకాదు.. అధ్యక్ష కాలం ముగిసిన తర్వాత ఈ విమానాన్ని వ్యక్తిగతంగా వాడతారా? అని మరో విలేకరి ప్రశ్నించగా మంట పుట్టిన ఆయన.. ‘వారు ఫ్రీగా జెట్ విమానం ఇస్తుంటే లేదు. నాకు ఫ్రీగా వద్దు. దీనికి మీకు నేను బిలియన్ డాలర్లు లేదంటే 400 మిలియన్ డాలర్లు చెల్లిస్తానని చెప్పాలా?’ అంటూ మండిపడుతూ.. తన తర్వాత ఈ విమానాన్ని అధ్యక్ష లైబ్రరీ ప్రదర్శనకు విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏమైనా.. ట్రంప్ మినహా మరే అమెరికా అధ్యక్షుడు సైతం ఇలా వ్యవహరించరేమో?
