అక్కడ ఇరాన్.. ఇక్కడ అప్ఘన్.. అమెరికా, పాక్ పెద్ద స్కెచ్
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
By: A.N.Kumar | 28 Feb 2026 4:07 PM ISTదక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అఫ్గానిస్థాన్‌తో పాకిస్థాన్ "నేరుగా యుద్ధం" ప్రకటిస్తే.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆ దేశానికి ఊహించని మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
పాక్ నాయకత్వంపై ట్రంప్ ప్రశంసల జల్లు
అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన తరుణంలో ట్రంప్ పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. శనివారం ఫిబ్రవరి 28, 2026 వైట్ హౌస్ వేదికగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ నాయకత్వాన్ని ఆకాశానికెత్తేశారు. "పాకిస్థాన్‌తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ అద్భుతమైన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ , అద్భుతమైన జనరల్ ఆసిమ్ మునీర్ ఉన్నారు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. పాకిస్థాన్ ప్రస్తుతం చాలా గొప్పగా పనిచేస్తోంది." అంటూ డొనాల్డ్ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. దీన్ని బట్టి మళ్లీ ఇరాన్ పై యుద్ధానికి పాకిస్తాన్ ను వాడుకునే పనిలో ట్రంప్ పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వివాదంలో తాను జోక్యం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పాకిస్థాన్ తనను తాను రక్షించుకోగల సామర్థ్యం కలిగి ఉందని ఆయన సంకేతాలిచ్చారు. గతంలో జో బైడెన్ హయాంలో పాకిస్థాన్‌కు దూరంగా ఉన్న అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ దేశంతో దోస్తీ కట్టడం గమనార్హం.
సరిహద్దుల్లో 'ఓపెన్ వార్'.. రణరంగమైన దురాండ్ లైన్
గత కొద్ది రోజులుగా పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో భీకర పోరు సాగుతోంది. అఫ్గాన్ తాలిబన్ల దాడులకు నిరసనగా పాకిస్థాన్ 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' పేరుతో కాబూల్, కాందహార్ వంటి ప్రధాన నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. 270 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించారని పాక్ ప్రకటించగా పాక్ సరిహద్దు పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నామని అఫ్గాన్ క్లెయిమ్ చేస్తోంది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ కూడా పాక్‌కు అండగా నిలిచింది. "ఉగ్రవాద గ్రూపుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాకిస్థాన్‌కు ఉంది" అని స్పష్టం చేసింది.
ఇరాన్, చైనా, రష్యా ఏమంటున్నాయి?
అమెరికా పాక్‌కు మద్దతు ఇస్తుంటే, మరోవైపు పొరుగు దేశాలైన ఇరాన్, చైనా మరియు రష్యా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రకటించారు. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి.
ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన
పాకిస్థాన్ ఒకవైపు అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేస్తూ మరోవైపు ఇరాన్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలు పెంచుకుంటే అది దక్షిణాసియా మొత్తానికి ముప్పుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ మద్దతుతో పాకిస్థాన్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
మరి ఈ "బిగ్ స్కెచ్" వెనుక అసలు ఉద్దేశం ఏంటి? తాలిబన్లను అణచివేయడమా లేక ఈ ప్రాంతంలో అమెరికా తన పట్టును మళ్ళీ పెంచుకోవడమా? అన్నది వేచి చూడాలి.
