ఇరాన్ కు ఉప్పందించిన గూఢచారి ఎవరు? చెబుతారా? జైలుకు పోతారా? మీడియాకు ట్రంప్ వార్నింగ్
అమెరికా రక్షణ రంగంలో కలకలం రేపుతున్న 'ఆపరేషన్ లీక్' ఉదంతంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By: A.N.Kumar | 8 April 2026 10:33 AM ISTఅమెరికా రక్షణ రంగంలో కలకలం రేపుతున్న 'ఆపరేషన్ లీక్' ఉదంతంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు చేరవేసిన "అంతర్గత గూఢచారి" ఎవరో చెప్పాలని.. లేనిపక్షంలో జైలు శిక్ష అనుభవించక తప్పదని జర్నలిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తీరంలో కూలిపోయిన యుద్ధ విమాన పైలట్ ప్రాణాలను కాపాడే రక్షణ మిషన్‌కు సంబంధించిన వివరాలు బయటకు రావడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఇటీవల ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరిని సైన్యం సురక్షితంగా రక్షించగలిగింది. అయితే రెండో పైలట్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్న సమయంలోనే ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ ఈ మిషన్ వివరాలను ప్రచురించింది. ఈ వార్త బయటకు రావడంతో రెండో పైలట్‌ను పట్టుకోవడం కోసం ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పైగా ఆ పైలట్‌ను తమకు అప్పగించిన వారికి భారీ నజరానా ఇస్తామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించడం అమెరికాకు తలనొప్పిగా మారింది.
మాలోనే గూఢచారి ఉన్నాడు.. ట్రంప్ ఆగ్రహం..
సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ లీక్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మన ప్రభుత్వ వ్యవస్థలోనే మన మధ్యనే ఒక గూఢచారి ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అత్యంత సున్నితమైన సమాచారాన్ని బయటకు పంపుతున్న ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదనిపిస్తోంది. ఇది కేవలం సమాచార లీక్ కాదు.. ఇది దేశద్రోహం" అని ట్రంప్ మండిపడ్డారు. రక్షణ ఆపరేషన్ వివరాలు ప్రచురించడం వల్ల శత్రు దేశాలు అప్రమత్తం అవుతాయని.. ఇది నేరుగా అమెరికా సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గూఢచారి పేరు చెప్పండి లేదా జైలుకు వెళ్ళండి.. మీడియాకు అల్టిమేటం..
ఈ సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ట్రంప్ మీడియాను లక్ష్యంగా చేసుకున్నారు. సదరు వార్తా సంస్థ లేదా జర్నలిస్ట్ ఆ సమాచారం తనకు ఎక్కడి నుంచి అందిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు చెప్పకపోతే సదరు జర్నలిస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి ఆ జర్నలిస్టు పేరును గానీ.. ఆ మీడియా సంస్థ వివరాలను గానీ ట్రంప్ బహిర్గతం చేయలేదు.
మిషన్ తీవ్రత.. 155 విమానాల మోహరింపు
ఈ ఆపరేషన్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో వివరిస్తూ ట్రంప్ కొన్ని గణాంకాలను వెల్లడించారు. రెండో పైలట్‌ను కాపాడటానికి అమెరికా ప్రభుత్వం చిన్నపాటి యుద్ధం స్థాయిలోనే బలగాలను రంగంలోకి దించింది. ఏకంగా 155 మొత్తం విమానాలను రంగంలోకి దింపింది. 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు ఇరాన్ పైకి పంపించింది. ఇంతటి భారీ వ్యయంతో కూడిన, అత్యంత రహస్యమైన ఆపరేషన్ వివరాలు శత్రువులకు తెలిసేలా చేయడంపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు లోతైన దర్యాప్తు చేపట్టింది.
భద్రతా వైఫల్యంపై ఆందోళన
ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైట్ హౌస్ లేదా పెంటగాన్ లోని ఉన్నత స్థాయి అధికారుల నుంచే ఈ సమాచారం లీక్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ కఠిన వైఖరి మీడియా స్వేచ్ఛకు, దేశ భద్రతకు మధ్య ఉన్న సన్నని గీతపై కొత్త చర్చకు దారితీసింది. లీక్ చేసిన వ్యక్తి దొరికితే అతడికి కఠిన శిక్ష పడటం ఖాయమని శ్వేతసౌధ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
