Begin typing your search above and press return to search.

ఒబామాపై ట్రంప్ కు ఎంత కోపం ఉందంటే... వీడియో వైరల్!

అవును... మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సంబంధించి ఓ వీడియో పోస్ట్‌ చేశారు తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

By:  Tupaki Desk   |   21 July 2025 1:12 PM IST
ఒబామాపై ట్రంప్  కు ఎంత కోపం ఉందంటే... వీడియో వైరల్!
X

అధికారంలో ఉన్న వారు.. గతంలో అధికారంలో ఉండి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ, అరెస్టులు చేయించడం రాజకీయాల్లో ట్రెండ్ గా మారిందని అంటున్నారు. ఇందులో కొన్ని సక్రమమైన అరెస్టులు ఉండగా, మరికొన్ని కక్షసాధింపు చర్యల్లో భాగంగా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఈ సమయంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా అరెస్టుకు సంబంధించిన ఏఐ వీడియోను డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడం ఆసక్తిగా మారింది.

అవును... మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సంబంధించి ఓ వీడియో పోస్ట్‌ చేశారు తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా... ఓవల్‌ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్.బీ.ఐ) అధికారులు ఒబామాను అరెస్టు చేస్తున్నట్లుగా ఆ వీడియోను రూపొందించారు! ఈ సందర్భంగా... 'చట్టానికి ఎవరూ అతీతులు కారు' అనే మెసేజ్‌ ఇస్తూ ఒబామాపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ముందుగా... 'చట్టానికి అధ్యక్షుడు అతీతుడే' అని ఒబామా అన్నట్లుగా ఉండగ.. అనంతరం... 'చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు' అని పలువురు రాజకీయ నాయకులు మాట్లాడినట్లు ఉంది. చివరకు ట్రంప్‌, ఒబామా మాట్లాడుకుంటుండగా ఎఫ్‌.బీ.ఐ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.. మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఈ వీడియోను రూపొందించారు. అనంతరం ఖైదీల యూనీఫామ్ లో ఒబామా కటకటాల వెనుక కనిపిస్తారు.

కాగా... అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీఎత్తున మోసాలకు పాల్పడ్డారంటూ ట్రంప్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2016 ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన తర్వాత.. ఆయన పాలనను నియంత్రించేందుకు ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని యూఎస్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వీడియోను విడుదల చేసినట్లు చెబుతున్నారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ ఫామ్‌ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్టింట ఇది వైరల్ గా మారింది. మరోవైపు దీనిపై ట్రంప్ కు కౌంటర్లు పడుతున్నాయి. ఇందులో భాగంగా.. ఎఫ్ స్టీన్ ఫైల్స్ నుండి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంగా దీనిని పలువురు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.