Begin typing your search above and press return to search.

‘పాక్ ను సిగ్గుపడేలా చేసిన ట్రంప్’... పక్క దేశంలో కొత్త పంచాయతీ!

అవును... ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది పాక్ సర్కార్. అయితే అలా ప్రతిపాదించిన మర్నాడే అమెరికా ఇరాన్‌ పై దాడులు చేపట్టింది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:00 PM IST
‘పాక్ ను సిగ్గుపడేలా చేసిన ట్రంప్’... పక్క దేశంలో కొత్త పంచాయతీ!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును 'నోబెల్‌ శాంతి పురస్కారం - 2026' కు పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు విమర్శలు రాగా తాజాగా ఆ దేశంలోని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ సందర్భంగా... ట్రంప్ చేతులు రక్తంతో తడిచాయని, ఆ చేతులలో శాంతి బహుమతి ఎలా అంటూ ప్రశ్నిస్తున్నాయి.

అవును... ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది పాక్ సర్కార్. అయితే అలా ప్రతిపాదించిన మర్నాడే అమెరికా ఇరాన్‌ పై దాడులు చేపట్టింది. దీంతో.. ఈ దాడుల విషయంలో ట్రంప్ ను విమర్శిస్తున్నవారంతా అటు పాక్ పైనా ఫైరవుతున్నారు. ఈ విషయంపై పాకిస్థాన్ లోని ప్రతిపక్షాలు.. ఆ దేశ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన ప్రతిపక్ష పాకిస్థాన్‌ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ శాసనసభ్యుడు అలీ ముహమ్మద్ ఖాన్... ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ యుద్ధంలో తమ మద్దతు టెహ్రాన్‌ కే అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... ఇరాన్‌ పై దాడులకు పాల్పడిన వారిని నోబెల్‌ బహుమతికి ప్రతిపాదించినందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిగ్గుపడేలా ట్రంప్‌ ప్రవర్తించారని మండిపడ్డారు.

తాజా పరిణామాల నేపథ్యంలో... ఇకనైనా ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించే విషయంలో షరీఫ్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం కంటే మూర్ఖపు పని మరొకటి లేదని తెలిపారు!

ఇదే సమయంలో... పాకిస్థాన్‌ లోని జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం పార్టీకి నాయకత్వం వహిస్తున్న మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ స్పందిస్తూ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శాంతికాముకుడు అనే వాదన తప్పని, అది స్వయంగా ఆయనే తాజాగా మరోసారి నిరూపించుకున్నాడని అన్నారు. దాడులకు మద్దతిచ్చే అమెరికా అధ్యక్షుడు శాంతిదూత ఎలా అవుతాడని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో స్పందించిన పాక్ మాజీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్... ట్రంప్‌ శాంతి కోసం పనిచేసే నాయకుడు కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఆయన పలు యుద్ధాలకు మద్దతునిస్తున్నారని పేర్కొన్నారు. రక్తంతో తడిచిన ఆయన చేతులకు శాంతి బహుమతిని అందుకునే హక్కు లేదని అన్నారు. అన్ని దేశాలను నాశనం చేయాలనే ఆలోచనతో ట్రంప్ ఉంటారని తెలిపారు.

ఏది ఏమైనా... ఇకనైనా నోబెల్ బహుమతికి ఆయన పేరును ప్రతిపాదించడాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ దేశంలోని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. పాక్‌ ఆర్మీ చీఫ్ మునీర్‌ కు ట్రంప్‌ విందు ఇవ్వడంతో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించి ఉంటుందని పేర్కొన్నాయి!