Begin typing your search above and press return to search.

‘నీకు పిచ్చి పట్టింది’.. నెతన్యాహుపై ఒంటికాలిపై లేచిన ట్రంప్

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో బాంబులు పేలుతున్నాయో లేక అగ్రరాజ్యాల మధ్య ఫోన్లు పేలుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

By:  A.N.Kumar   |   2 Jun 2026 12:49 PM IST
‘నీకు పిచ్చి పట్టింది’.. నెతన్యాహుపై ఒంటికాలిపై లేచిన ట్రంప్
X

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో బాంబులు పేలుతున్నాయో లేక అగ్రరాజ్యాల మధ్య ఫోన్లు పేలుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇరాన్‌తో ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్న తరుణంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వరుస దాడులు కొనసాగించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత ఇటు వైట్‌హౌస్‌లో అటు ఇజ్రాయెల్ పీఎంఓలో జరిగిన చర్చల కంటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సెటైర్లే ఇప్పుడు హైలైట్‌గా మారాయి. "ఈ కాల్‌ మాట్లాడకుండా మిస్ చేసి ఉంటే బాగుండేది" అని నెతన్యాహు అనుకుని ఉంటారంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

చెస్ బోర్డుపై లూడో ఆట.. వైట్‌హౌస్‌ గుసగుసలు

వైట్‌హౌస్‌ కారిడార్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ట్రంప్‌ తనదైన ముక్కుసూటి శైలిలో నెతన్యాహుపై విరుచుకుపడ్డారట. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు తాను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద 'చెస్' గేమ్ ఆడుతుంటే నెతన్యాహు మాత్రం సంబంధం లేకుండా 'లూడో' ఆడుతూ పాచికలు వేస్తున్నారని ట్రంప్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా వ్యూహాలకు భిన్నంగా ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రెండు వాట్సాప్ గ్రూపుల మధ్య నలిగిపోతున్న 'అడ్మిన్'!

ప్రస్తుతం నెతన్యాహు పరిస్థితి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు సొంత దేశంలో భద్రత, ఉనికిని కాపాడుకోవడం కోసం దాడులు కొనసాగించాల్సిన అంతర్గత ఒత్తిడి ఉంది. మరోవైపు తమకు ప్రధాన అండగా నిలిచే అమెరికా నుంచి "కాస్త బ్రేక్ వేయండి బాస్!" అనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఆయన పరిస్థితి రెండు పరస్పర విరుద్ధమైన వాట్సాప్ గ్రూపుల మధ్య చిక్కుకుని, ఎటు వైపు మాట్లాడాలో తెలియక సతమతమయ్యే ఒక 'అడ్మిన్'లా మారిందని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

శాంతి దూత వర్సెస్ యుద్ధ వీరుడు

ఇరాన్‌తో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని ప్రపంచ వేదికపై తనను తాను ఒక గొప్ప 'శాంతి దూత'గా ప్రెజెంట్ చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కానీ నెతన్యాహు మాత్రం "ముందు భద్రత.. ఆ తర్వాతే రాజకీయాలు లేదా చర్చలు" అనే కఠిన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరి భిన్న ధోరణుల వల్ల వీరి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఒక హై-వోల్టేజ్ రాజకీయ థ్రిల్లర్ సినిమాను తలపించిందని ఇరు దేశాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్షిపణుల కంటే ఫోన్ కాల్సే డేంజర్!

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. మధ్యప్రాచ్యంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాంతి ఒప్పందం ముందుగా అమల్లోకి వస్తుందా? లేక ఈ లోపే ట్రంప్‌ ఆగ్రహానికి గురైన నెతన్యాహు మరోసారి ఫోన్ లైన్లోకి వస్తారా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఏదేమైనా ఈ తాజా ఘటనే ఒక విషయాన్ని మాత్రం నూటికి నూరు శాతం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో శత్రువుల క్షిపణుల కంటే వైట్‌హౌస్‌ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మాత్రమే ఎక్కువ భయాన్ని, వణుకును పుట్టిస్తున్నాయి!