డొనాల్డ్ ట్రంప్ పై కెలిఫోర్నియా గవర్నర్ కేసు.. అమెరికాలో మరో సంచలనం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత, రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 10 Jun 2025 11:37 AM ISTఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత, రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో ఆయన తీసుకున్న కఠిన చర్యలపై లాస్ ఏంజిలెస్‌లో వలసదారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ పరిణామాలకు ట్రంప్ వెంటనే స్పందిస్తూ, లాస్ ఏంజిలెస్ పరిసర ప్రాంతాల్లో జాతీయ రక్షణ దళాన్ని (నేషనల్ గార్డ్) మోహరించేందుకు ఆదేశించారు. అయితే, ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురైంది.
స్థానిక పోలీసు విభాగాలు ఈ పరిస్థితిని నిర్వహించగలవని, జాతీయ రక్షణ దళాన్ని అవసరం లేని పరిస్థితుల్లో వినియోగించడం సరికాదని గవర్నర్ గావిన్ న్యూసమ్, మేయర్ కారెన్ బాస్ వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ న్యూసమ్ డొనాల్డ్ ట్రంప్ పై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర అధికార పరిధిని అధిగమిస్తూ జాతీయ రక్షణ దళాన్ని మోహరించడం చట్ట విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, ట్రంప్ మాత్రం “జాతీయ రక్షణ దళం మోహరించకపోతే లాస్ ఏంజిలెస్ నాశనమయ్యేదే” అని వ్యాఖ్యానించారు. ఈ చర్యలో భాగంగా 2000 మంది జాతీయ రక్షణ దళ అధికారులు లాస్ ఏంజెల్స్ లో మోహరించడాన్ని ఆదేశించారు. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ దళాన్ని వినియోగిస్తారు. అయితే ఈసారి నిరసనలను కట్టడి చేయడానికే దీనిని వినియోగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో న్యూసమ్ తీసుకున్న న్యాయపోరాట నిర్ణయం అమెరికన్ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారి తీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్ర ప్రభుత్వం అతిక్రమిస్తున్నప్పుడు, రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కేసు భవిష్యత్తులో కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.