ట్రంప్ ను గద్దె దించండి.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రాజుకున్న మాటల యుద్ధం మస్క్‌కు భారీ నష్టాలను మిగిల్చింది.
By: Tupaki Desk | 6 Jun 2025 11:41 AM ISTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రాజుకున్న మాటల యుద్ధం మస్క్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ గొడవ కారణంగా నిన్న ఒక్కరోజే ఆయన 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12.8 లక్షల కోట్లు) కోల్పోయారు. మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు ఏకంగా 14శాతం పడిపోయాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పన్ను బిల్లుపై విభేదాలు
ట్యాక్స్ బిల్లు విషయంలో ట్రంప్‌పై మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ బిల్లుతో విద్యుత్ వాహనాలకు ఇచ్చే పన్ను రాయితీలు రద్దవుతాయని మస్క్ ఆరోపిస్తున్నారని ట్రంప్ చెబుతున్నారు. ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు వీరిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. మస్క్ దృష్టిలో ఈ ట్యాక్స్ బిల్లు అమెరికాకు ఆర్థికంగా హానికరం, కాగా ట్రంప్ దీనిని దేశాభివృద్ధికి అవసరమైనదిగా పేర్కొంటున్నారు.
ట్రంప్‌ను తొలగించండి
ట్రంప్-మస్క్ గొడవ మరింత ముదిరింది. ఒక సామాజిక మాధ్యమ వినియోగదారుడు 'ట్రంప్‌ను అభిశంసన ద్వారా తొలిగించి, అతని స్థానంలో జేడీ వాన్‌ను అధ్యక్షుడిని చేయాలి' అంటూ పెట్టిన ట్వీట్‌ను మస్క్ రీట్వీట్ చేస్తూ 'అవును (YES)' అంటూ రీ ట్వీట్ చేశారు. ఇది మస్క్ ట్రంప్ పట్ల ఎంత ఆగ్రహంతో ఉన్నారో స్పష్టం చేస్తోంది.
వాణిజ్య యుద్ధం కూడా మొదలైందా?
మస్క్, ట్రంప్ మధ్య కేవలం మాటల యుద్ధమే కాకుండా వాణిజ్య యుద్ధం కూడా మొదలైనట్లు కనిపిస్తోంది. ఎలాన్‌కు గతంలో ఇచ్చిన రాయితీలు, ఒప్పందాలు రద్దు చేస్తే బాగుంటుందని ట్రంప్ అన్నారు. దీనికి బదులుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మస్క్ ప్రకటించారు. ఇది వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలపైనా ప్రభావం చూపుతుందని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు అమెరికా రాజకీయ, ఆర్థిక రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
