Begin typing your search above and press return to search.

మోడీని పొగిడిన ట్రంప్.. ఏంటి కథ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   27 March 2026 7:00 PM IST
మోడీని పొగిడిన ట్రంప్.. ఏంటి కథ?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. “మోదీ, నేనూ చేతల మనుషులం” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల దృఢతను మరోసారి ప్రతిబింబించాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాకుండా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంకేతంగా కూడా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచ రాజకీయాల్లో మాటల కంటే చేతలే ముఖ్యమని ఆ విషయంలో తాను, మోదీ ఒకే తత్వాన్ని పంచుకుంటున్నామని చెప్పారు. “ఇలాంటి లక్షణాలు ప్రతి నాయకుడికి ఉండవు” అని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన మోదీ నాయకత్వాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. రానున్న కాలంలో భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడం విశేషం.

ఇక ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే రెండు రోజుల క్రితం ట్రంప్, మోదీ మధ్య కీలక టెలిఫోన్ సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ చమురు రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ మార్గాన్ని ఎప్పటికప్పుడు తెరిచి ఉంచడం అత్యవసరమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై భారత్ కూడా సానుకూల వైఖరిని వ్యక్తం చేయడం గమనార్హం.

మరోవైపు ఈ సంభాషణపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం సమిష్టి కృషి అవసరమని ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తాజా టెలిఫోన్ సంభాషణలు.. అన్ని కలిపి భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడే దిశగా సాగుతున్నాయని స్పష్టమవుతోంది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో ఈ భాగస్వామ్యం కీలకంగా మారనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.