త్రివిక్రమ్ ట్రంప్ ... అ.. ఆ.. స్క్రిప్ట్... రష్యా చెవిలో జోరీగ
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అ... ఆ.. స్క్రిప్ట్ రాశారు. దశాబ్దాలుగా తన్నుకుంటున్న రెండు దేశాల చేతులను కలిపారు.
By: Tupaki Desk | 11 Aug 2025 9:38 AM ISTఅ... ఆ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమా. అనసూయ భరద్వాజ్.. ఆనంద్ విహారి అనే హీరోయిన్, హీరో పేర్లలోని తొలి అక్షరాలను తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన ఈ మూవీ కథాంశం విడిపోయిన రెండు కుటుంబాలను కలపడం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అ... ఆ.. స్క్రిప్ట్ రాశారు. దశాబ్దాలుగా తన్నుకుంటున్న రెండు దేశాల చేతులను కలిపారు.
ఒకప్పటి సోవియట్ యూనియన్ నుంచి...
అజర్ బైజాన్, ఆర్మేనియా... ఒకప్పటి యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్)లో భాగమైన దేశాలు. 35 ఏళ్ల కిందట యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. సొంత దేశాలుగా అయితే ఏర్పడ్డాయి కానీ, అప్పటినుంచి వీటి మధ్య గొడవలే గొడవలు. తాజాగా వీటికి ట్రంప్ చేతుల మీదుగా చరమగీతం పాడాయి.
ప్రపంచ శాంతి దూతగా..
రెండోసారి అధ్యక్షుడు కావడం ఆలస్యం.. యుద్ధాలను ఆపేస్తానంటూ నమ్మబలికిన ట్రంప్ రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలను నిలువరించలేకపోయారు. కానీ, అజర్ బైజాన్-ఆర్మేనియా మధ్య శాంతి ఒప్పందం కుదిరేలా చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ రెండు దేశాల అధినేతలు ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ట్రంప్ రూట్ లో....
అజర్ బైజాన్ కు అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్ కాగా ఆర్మేనియాకు ప్రధానమంత్రి నికొల్ పాశిన్యాన్ ఉన్నారు. ఈ రెండు దేశాలకు రష్యాతో అంతగా సత్సంబంధాలు లేవు. అంతేగాక ఈ దేశాలకు నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై విభేదాలున్నాయి. ఇది జాతులు, భౌగోళిక సమస్య. 2023 వరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆర్మేనియన్లు నివసించారు. 1990లలో ఎక్కువగా అజర్‌బైజాన్‌లు ఉన్నారు. వీరిని అనంతరం వెళ్లగొట్టారు. గత కొన్నేళ్లలో వీటి మధ్య ఘర్షణలు జరిగాయి. తాజాగా ట్రంప్ సంధి కుదిర్చారు. ఈ రెండు దేశాల కీలక రవాణా మార్గాలను తిరిగి ప్రారంభించేలా ఈ ఒప్పందం కుదిర్చారు. అమెరికాతోనూ ఒప్పందం చేసుకున్నాయి.
కొసమెరుపుః ముఖ్యమైన సరుకు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసి దానికి ట్రంప్ రూట్ అని పేరు పెట్టేందుకు అజర్ బైజాన్-ఆర్మేనియా అంగీకరించాయి. దీనికి ట్రంప్ రూట్ అని పేరు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ సంధి కుదిరిన విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ప్రకటించి.. థ్యాంక్స్ టు ట్రంప్ అని తనకు తానే రివార్డు ఇచ్చుకున్నారు. తమ నుంచి విడిపోయిన దేశాల మధ్య ట్రంప్ సయోధ్య కుదర్చడం ఎంతైనా రష్యాకు ఇబ్బందే అనడంలో సందేహం లేదు.
