భార్యతో లండన్ కు వెళ్లిన ట్రంప్ కు.. ఊహించని చేదు అనుభవం
భార్య మెలానియాతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్.. బ్రిటన్ రాజు చార్లెస్ అతిథ్యం ఇస్తున్నారు. రాయల్ విండ్సర్ కోటలో వీరు బస చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Sept 2025 11:04 AM ISTపాపం ట్రంప్ అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. అగ్రరాజ్యాధినేతకు అధినేతగా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ.. యూఎస్ ఫస్ట్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అతనికి ఇంటా బయటా వరుస ఎదురుదెబ్బలు తగులుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి చేదు అనుభవం బ్రిటన్ రాజధాని లండన్ లో చోటు చేసుకుంది. భార్య మెలానియాతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్.. బ్రిటన్ రాజు చార్లెస్ అతిథ్యం ఇస్తున్నారు. రాయల్ విండ్సర్ కోటలో వీరు బస చేస్తున్నారు.
సరిగ్గా ఇదే కోట బయట.. ట్రంప్ నకు చేదు అనుభవం ఎదురైంది. ఎందుకుంటే.. ఈ భవనంపైన ట్రంప్ తో కలిసి ఉన్న.. లైంగిక నేరస్థుడైన ఎప్ స్టీన్ పాత ఫోటోను లేజర్ టెక్నాలజీతో ప్రదర్శించారు. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. రాజకీయ నేతలకు వ్యతిరేకంగా వైరల్ స్టంట్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘లెడ్ బై డాంకీస్’ అనే గ్రూపు ఈ సాహసానికి తెగబడినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. లేజర్ సాయంతో ప్రదర్శించిన ఫోటోను.. వీడియోను అధికారులు అడ్డుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకకు నిరసనగానే ఈ పని చేసినట్లుగా చెబుతున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో ట్రంప్ నకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 1990-2000 మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. ఎప్ స్టీన్ తనకు తెలుసన్న విషయాన్ని ట్రంప్ సైతం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
తనకు పదిహేనేళ్లుగా ఎప్ స్టీన్ తెలుసని.. అతనో అద్భుతమైన వ్యక్తిగా పేర్కొంటూ.. అతను తన మాదిరే అందమైన యువతులు.. బాలికల్ని ఇష్టపడతారని పేర్కొనటం తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో ఎప్ స్టీన్ కు ట్రంప్ తో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి అతడితో సంబంధాలు తెంచుకున్నట్లుగా ఈమధ్యనే ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాను కుదిపేసిన సెక్సు కుంభకోణంలో ఎప్ స్టీన్ ను 2019లో అరెస్టు చేశారు. అదే ఏడాది జైల్లో అతను అనుమానాస్పద రీతిలో మరణించటం సంచలనంగా మారింది. ఏమైనా.. భార్యతో కలిసి బ్రిటన్ రాజుగారు అతిథ్యం అందించే కోటలోనే ట్రంప్ నకు ఈ తరహా అనుభవం ఎదురుకావటం ఆయనో షాక్ గా పేర్కొంటున్నారు.
