Begin typing your search above and press return to search.

20 అడుగుల పొడవు.. 13,600 కేజీల బరువు... ఇరాన్ పైకి అమెరికా స్పెషల్!!

అవును... పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటికే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.

By:  Tupaki Desk   |   17 Jun 2025 12:50 PM IST
20 అడుగుల పొడవు.. 13,600 కేజీల బరువు... ఇరాన్ పైకి అమెరికా స్పెషల్!!
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పటికే తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో... పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటివరకూ ఒకలెక్క, ఇప్పటి నుంచి ఒకలెక్క అన్నట్లుగా మారబోతున్నాయనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి కారణం ట్రంప్ చేస్తోన్న హడావిడే!

అవును... పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటికే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇక ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని.. తమ టార్గెట్ ను చెప్పకనే చెప్పారు. ఈ సమయంలో వాతావరణం మరింత వేడెక్కేలా ట్రంప్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.

దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ హడావుడిగా జీ7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడం, తాను అమెరికాకు రాగానే అత్యవసర భేటీ ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారులకు ఆదేశాలు ఇవ్వడం ఒకటి కాగా... పౌరులంతా టెహ్రాన్ కు ఖాళీ చేసి వెళ్లాలని నిక్కచ్చిగా చెప్పడం మరొకటి. దీంతో... 'వాట్ నెక్స్ట్' అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈ సమయంలో... ఇరాన్ లోని పార్దో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. అందుకు సరైన ఆయుధం... జీబీయూ-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబ్ అని అంటున్నారు. ఎందుకంటే... పార్దో అణుకేంద్రంలో 2023లోనే 83.7% శుద్ధిచేసిన యురేనియంను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గుర్తించింది.

అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది దగ్గరగా ఉంది. దీంతో.. ఓ పర్వతం లోపల సొరంగంలో నిర్మించిన ఈ పార్దో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడం సాధారణ బాంబుల వల్ల కాదు. అందుకే అమెరికా అంబుల పొదిలోని తురుపుముక్కను బయటకు తీస్తున్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... సుమారు 20 అడుగుల పోడవు, 13,600 కిలోల బరువు ఉండే జేబీయూ-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడనున్నారని అంటున్నారు. దీన్ని బీ-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. దీంతో.. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన సుమారు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గాసియా బేస్ కు అమెరికా చేర్చింది.

మరోవైపు... తాను జీ7 సదస్సును ఎందుకు వీడుతున్నానో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పిన ట్రంప్... తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదని.. కాల్పుల విరమణ గురించి కాదని.. అంతకంటే “పెద్దదే” జరగబోతోందని అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో.. పై ప్రచారాన్ని పలువురు కన్ఫాం చేస్తున్నారు.