ట్రంప్ శాంతి చర్చలు ఎలా జరిపారంటే... ఎవరీ 'బీబీ'?
అవును... రోజురోజుకీ తీవ్ర ఉధృతంగా మారుతోన్న పశ్చిమాసియాలోని పరిస్థితిపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jun 2025 10:24 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ స్వయంగా ఫోన్ లోమాట్లాడగా.. అటు ఇరాన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ఈ శాంతి చర్చలు ఎలా జరిగాయనేది ఆసక్తిగా మారింది.
అవును... రోజురోజుకీ తీవ్ర ఉధృతంగా మారుతోన్న పశ్చిమాసియాలోని పరిస్థితిపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇరాన్ లో ఉన్న అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. దీంతో.. ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఈ సమయంలో ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్ అంటూ అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పై దాడి చేసింది.
అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ దాడులు చేపట్టింది. దీంతో... ఈ యుద్ధం ప్రపంచదేశాలకు విస్తరిస్తోందనే ఆందోళనలు నెలకొన్న వేళ.. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ – ఇరాన్ లతో శాంతి చర్చలు జరపాలని ట్రంప్ నిర్ణయించడం గమనార్హం. దీనికి సంబంధించి అదే రోజు రాత్రి ట్రంప్ తన టీమ్ ను ఈ మేరకు ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
తాజా కథనాల ప్రకారం... తొలుత ఇరాన్ అధికారులకు ఫోన్ చేయండి, వారితో చర్చలు జరపండి అని అధికారులను ఆదేశించిన ట్రంప్.. అనంతరం, "బీబీ" (బెంజమిన్ నెతన్యాహు)ని లైన్ లోకి తీసుకోండని చెప్పారని.. ఈ సందర్భంగా మనం శాంతి చర్చలు చేయబోతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ అధికారి ఒకరు ఈ వ్యవహారం మొత్తం ఎలా జరిగిందనేది వివరించారు!
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ నేరుగా ఫోన్ లోమాట్లాడగా.. ఇటు ఇరాన్ అధికారులతో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విక్ కోఫ్ చర్చలు జరిపారని తెలిపారు!
ఆ చర్చల అనంతరం... ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ రాసుకొచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడులు ఆపలేదని అంటున్నారు.
