ట్రంప్ మరోసారి భారత్ కొంప ముంచనున్నారా ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో నోటితో నవ్వుతారు, నొసటితో వెక్కిరిస్తారు అన్న సామెత ఉండనే ఉంది.
By: Satya P | 3 April 2026 12:49 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో నోటితో నవ్వుతారు, నొసటితో వెక్కిరిస్తారు అన్న సామెత ఉండనే ఉంది. ఆయన భారత్ మిత్ర దేశం అంటూనే భారీ వాణిజ్య సుంకాలను విధిస్తారు. ఇపుడు ఆయన ఇరాన్ మీదకు దండెత్తి వెళ్ళారు, ఈ యుద్ధం అంతా లోక శాంతి కోసం అని చెప్పుకున్నారు. ఇరాన్ అణు బాంబులను ఎవరి మీద వేయకుండా రక్షించేందుకే అని నమ్మ బలికి మరీ యుద్ధానికి సిద్ధపడ్డారు. నెల రోజుల పై దాటింది కానీ ఈ యుద్ధం ఎటూ పాలుపోని తీరులో ఉంది. ముఖ్యంగా ఇరాన్ అమెరికా చమురు తీసి చెమటలు పట్టిస్తోంది. ఇరాన్ తో విజయం ఖాయం అనుకున్న ట్రంప్ కి భారీ ఎత్తున నష్టాలని ఈ యుద్ధం చూపిస్తోంది.
వేల కోట్ల నష్టం :
ఈ నెల రోజుల యుద్ధం వల్ల అమెరికాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది అని అంటున్నారు. ఏకంగా అమెరికాకు రోజుకు 1 బిలియన్ డాలర్ల నుండి 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఈ యుద్ధానికి సంబంధించిన నివేదికల ప్రకారం ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక ఆస్తులకు గణనీయమైన అధిక వ్యయ నష్టాన్ని చవిచూసిందని చెబుతున్నారు. అంతే కాదు మొదటి రెండు రోజులలోనే దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా సైనిక పరికరాలు కోల్పోయినట్లు దెబ్బతిన్నట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి భారీగానే అమెరికా నష్టం చూస్తోంది అని అంటున్నారు. దెబ్బతిన్న వ్యవస్థలను భర్తీ చేయడానికి 200 బిలియన్ డాలర్లకు పైగా అదనపు వ్యయ అభ్యర్థనను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది.
ముక్కి పిండి వసూలు :
అయితే అమెరికా ఏమీ అమాయకం కాదని అంటున్నారు. ఆ దేశం ఈ యుద్ధం ఖర్చులను గల్ఫ్ దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చెబుతున్నారు. గల్ఫ్ దేశాలలో అమెరికా మిలటరీ బేస్ లను ఏర్పాటు చేసింది. అది వారి రక్షణ కోసం. వారంతా అభ్యర్ధించారు అన్న కారణంగా వాటిని ఏర్పాటి చేసి ఆ దేశాలను తమ కంట్రోల్ లో ఉంచుకుంది. ఇపుడు ఆ దేశాల నుంచే ఈ యుద్ధం ఖర్చులను నష్టాలను అమెరికా వసూలు చేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
భారత్ మీదనేనా :
ఒపిక్ దేశాలుగా పెరు గడించిన ఈ దేశాల నుంచి అమెరికా కనుక ఆర్థిక భారాలు మోపితే ఆ దేశాలు కూడా తాముగా నష్టపోవడానికి సిద్ధంగా లేవని అంటున్నారు. తమ వద్ద చమురు నిల్వలను కొనే దేశాల మీద ఈ భారాన్ని మోపి తాము సర్దుబాటు చేసుకుంటాయని అంటున్నారు. ఈ విధంగా చూస్తే నూటికి తొంబై శాతం ముడి చమురుని ఒపిక్ దేశాల నుంచే భారత్ కొనుగోలు చేస్తోంది. దాంతో భారత్ వంటి దేశాల మీద ఒపిక్ దేశాల ఆర్ధిక భారం ప్రత్యేకంగా యుద్ధ భారం పడబోతుందా అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే భారత్ లో ఆర్ధిక ఆహార ద్రవ్యోల్బనం పెద్ద ఎత్తున ఎగిసిపడుతుందని అనుమానిస్తున్నారు. ధరలు భారీగా పెరిగి సామాన్యుడి నడ్డి విరుగుతుందని చెబుతున్నారు.
యుద్ధం ఆగినా అంతే :
ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. ఇది భారత్ వంటి దేశాలకు ఇబ్బందిగా ఉంది. అయితే ఈ యుద్ధం రేపటి రోజున ఆగినా ఇంతే స్థాయిలో ఇబ్బందూ అయితే భారత్ లాంటి దేశాలు పడాల్సిందేనా అన్న చర్చ వస్తోంది. కేవలం భారత్ మీద కాదు ప్రపంచం మీదనే యుద్ధం ఖర్చు పరోక్షంగా అమెరికా రాసేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి అమెరికా తెలివి కానీ వ్యూహాలు కానీ ప్రపంచం మీదనే ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు అంతర్జాతీయ దౌత్య నిపుణులు.
