Begin typing your search above and press return to search.

చ‌ర్చ‌లు ఒట్టిమాటే.. ట్రంప్‌పై అంత‌ర్జాతీయ స‌మాజం ఫైర్‌

అయితే.. వీరిని త‌మ దేశానికి సుర‌క్షితంగా తీసుకువ‌చ్చే విష‌యంలో అమెరికా అధ్య‌క్షు డు ట్రంప్ చేతులు ఎత్తేశారు.

By:  Garuda Media   |   3 March 2026 11:33 PM IST
చ‌ర్చ‌లు ఒట్టిమాటే.. ట్రంప్‌పై అంత‌ర్జాతీయ స‌మాజం ఫైర్‌
X

ఇరాన్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని అనుకున్నామ‌ని.. కానీ, ఆ దేశం ముందుకు రాలేద‌ని.. వ‌చ్చినా అప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ట్రంప్ వాద‌న‌లో నిజం లేద‌ని నాటి దైత్యాధికారులు.. అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న ఉన్న విశ్లేష‌కులు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి ఇరాన్ ఆది నుంచి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేన‌ని చెప్పింద‌న్నారు. అయితే.. అమెరికా ఆధిప‌త్య ధోర‌ణిని మాత్ర‌మే ఇరాన్ వ్య‌తిరేకించింద‌న్నారు.

అదేస‌మ‌యంలో దొడ్డిదారిన ఇజ్రాయెల్‌తో చేతులు క‌లిపి.. ఆ దేశాన్ని రెచ్చ‌గొట్టి ఇరాన్‌పై దాడులు చేయించే దిశ‌గా అడుగులు వేసింద‌ని ప‌లువురు అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు రాసిన వ్యాసాల్లో స్ప‌ష్టం చేశారు. చివ‌ర‌కు గ‌త నెల 20న కూడా ఇరాన్ చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని చెబుతున్నారు. దీనికి ఒమ‌న్ దేశం కూడా మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు ముందుకు రాగా.. ఇరాన్ అంగీక‌రించింద‌ని పేర్కొన్నారు. కానీ, ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆది నుంచి ఇజ్రాయెల్‌, అమెరికాలు వ్యూహం ప‌న్నాయ‌ని.. అందుకే చ‌ర్చ‌ల పేరుతో కొన్నాళ్లు నాట‌కం ఆడాయ‌ని ది గార్డియ‌న్‌లో రాసిన వ్యాసంలో ఓ అంత‌ర్జాతీయ విశ్లేష‌కుడు పేర్కొన్నారు.

ఇక‌, ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వాద‌న‌లోనూ అర్ధం లేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఇరాన్ అంత‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని అంటున్నా.. అది సాధ్యం కాద‌ని అంటున్నారు. ఇరాన్ బ‌హుళ ఆయుధ వ్య‌వ‌స్థ ముందు.. అమెరికా ఇప్ప‌టికే చేతులు ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ పేర్కొంది. అయితే.. దీనిని ట్రంప్ తాజాగా కొట్టిపారేశారు. త‌మ వ‌ద్ద అనేక ఆయుధాలు ఉన్నాయ‌ని.. అవి చాలా శ‌క్తిమంత‌మైన‌వ‌ని పేర్కొన్నారు. ఆ ప‌త్రిక అమ్ముడు పోయింద‌ని వ్యాఖ్యానించారు. అయి తే.. దీనిని గార్డియ‌న్ త‌న సైట్‌లో ఖండించింది. తాము నిష్ప‌క్ష పాతంగా ప‌నిచేస్తున్నామ‌ని పేర్కొంది.

పౌరుల‌కు షాక్‌!

అమెరికాకు చెందిన గల్ఫ్ దేశాల్లోని స్థావ‌రాల‌పై ఇరాన్ క్షిప‌ణి దాడుల‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది. ఈ ప‌రిణామాల‌తో అక్క‌డి వివిధ దేశాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు. వీరిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. దుబాయ్‌, ఖ‌తార్‌, యూఏఈల‌లో భారీ సంఖ్య‌లో అమెరిక‌న్లు ప‌నిచేస్తున్నారు. అయితే.. వీరిని త‌మ దేశానికి సుర‌క్షితంగా తీసుకువ‌చ్చే విష‌యంలో అమెరికా అధ్య‌క్షు డు ట్రంప్ చేతులు ఎత్తేశారు. మీ ప్ర‌య‌త్నాలు మీరే చేసుకోవాల‌ని.. మీ అంత‌ట మీరే దేశానికి రావాల‌ని ట్రంప్ తాజాగా ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఎవ‌రికి ప్రాణాల‌ను వారు ర‌క్షించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.