న్యూస్ రాగానే ట్రంప్ కిందా మీదా... ఏమిదీ బాధ..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న పలు సంఘర్షణలు, వరుస యుద్ధాలు ఆపుతున్నానన్న సంతోషంలో, సంబరాల్లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్.
By: Tupaki Desk | 25 Jun 2025 6:00 PM ISTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న పలు సంఘర్షణలు, వరుస యుద్ధాలు ఆపుతున్నానన్న సంతోషంలో, సంబరాల్లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. వీటివల్ల తనకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చేలా ఉందనే ఆశల పల్లకిలోనూ ఊయలూగుతున్నట్లు కనిపిస్తున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా తెరపైకి వచ్చిన ఓ నివేదిక ట్రంప్ ను టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు.
అవును... ఇరాన్ పై దాడులు చేసేశాం.. ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ తో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాం.. అదే సమయంలో ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అంగీకారం నెలకొల్పాం.. అనుకున్న అని లక్ష్యాలను పూర్తి చేశాం అనే ఆనందంలో ట్రంప్ ఉన్నారని అంటున్నారు. ఆయన కూడా బలంగా క్లైయిం చేసుకుంటున్నారు.
సరిగ్గా ఈ సమయంలో... ట్రంప్ కి ఒక చేదు విషయం చెప్పే నివేదిక ఒకటి వెలువడింది. ఇందులో భాగంగా... ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడగా.. ఆ దాడుల్లో ఫోర్డో, నతాంజ్ లు పూర్తిగా నాశనం కాలేదు అంటూ పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదిక తెరపైకి వచ్చింది.
ఇదే సమయంలో... యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్ లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి ప్రారంభించుకోవచ్చని ఆ నివేదిక పేర్కొన్నట్లు సీ.ఎన్.ఎన్. తమ కథనంలో రాసుకొచ్చింది. దీంతో... ట్రంప్ కారాలు మిరియాలు నూరుతూ.. కిందా మీదా పడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టారు.
ఇందులో భాగంగా... అవన్నీ నకిలీ వార్తలు.. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇది.. ఆయా వార్తా సంస్థలను ప్రజలు నమ్మడం లేదు.. ఇరాన్ లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి అంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
ఇదే సమయంలో... వైట్ హౌస్ కూడా ఈ విషయంపై స్పందించింది. ఇందులో భాగంగా... ఇలాంటి అసత్య కథనాలు అధ్యక్షుడు ట్రంప్ ను కించపరచడమేనని.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధ పైలట్ల ధైర్యసాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నమే ఇదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ పేర్కొన్నారు.
దీంతో... పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక, దీనిపై సీ.ఎన్.ఎన్. రాసిన కథనం ట్రంప్ ను బాగా చికాకు పెట్టినట్లున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీనికి తోడు ఇప్పటికే ఇరాన్ అణుపరీక్షలు జరిపిందనే వార్తలు కూడా ట్రంప్ ను కిందా మీదా పడేస్తున్నాయని అంటున్నారు.
