యుద్ధం వద్దనుకున్న అగ్రదేశాధినేత.. ట్రంప్ వెనకడుగు వెనుక అసలు కథ!
అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట ‘సర్వనాశనం’ అనే మాట వచ్చిందంటే.. ప్రపంచం ఊపిరి బిగబట్టుకొని యుద్ధ మేఘాల కోసం ఆకాశం వైపు చూడాల్సిందే.
By: Tupaki Desk | 9 April 2026 11:02 AM ISTఅగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట ‘సర్వనాశనం’ అనే మాట వచ్చిందంటే.. ప్రపంచం ఊపిరి బిగబట్టుకొని యుద్ధ మేఘాల కోసం ఆకాశం వైపు చూడాల్సిందే. ‘ఇదే మీకు చివరి రాత్రి’ అని గర్జించిన కొన్ని గంటల్లోనే, అదే గొంతు శాంతి మంత్రం పఠించడం వెనుక కేవలం మనసు మార్చుకోవడమేనా..? లేక అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయమా..? శత్రువును బెదిరించడం, ఆపై మధ్యవర్తుల ద్వారా దారికి తెచ్చుకోవడం ట్రంప్ మార్క్ ‘ఆర్ట్ ఆఫ్ ది డీల్’ కావొచ్చు, కానీ ఇరాన్ విషయంలో ఆయన వేసిన అడుగులు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్య యత్నాలు
ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు మధ్య వర్తిత్వం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఇరాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా, యుద్ధం వస్తే ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతింటుందని హెచ్చరించడం అమెరికాను ఆలోచనలో పడేసింది. మరోవైపు, దేశీయంగా డెమోక్రాట్ల నుంచి ఎదురైన విమర్శలు, పోప్ లియో వంటి మత పెద్దల అభ్యంతరాలు ట్రంప్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. యుద్ధం చేయడం కంటే యుద్ధాన్ని ఆపాడనే గుర్తింపు తెచ్చుకోవడమే నా రాజకీయ భవిష్యత్తుకు మేలని ఆయన గ్రహించి ఉండవచ్చు.
ఖరీదైన యుద్ధ క్షేత్రం
యుద్ధం ప్రకటించడం సులభమే కానీ.., పర్షియన్ గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధిని నియంత్రించడం అమెరికాకు ఆర్థికంగా పెను భారంగా మారుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఇక్కడి నుంచే ఉంది. ఇరాన్‌ను నిలువరించాలంటే వేల సంఖ్యలో సైనికులను ఏళ్ల తరబడి అక్కడ ఉంచాలి. గతంలో అఫ్గనిస్థాన్, వియత్నాం యుద్ధాల్లో అమెరికా చవిచూసిన చేదు అనుభవాలు, వృథా అయిన వేల కోట్ల డాలర్లు ట్రంప్‌ను వాస్తవంలోకి తీసుకొచ్చాయి. కేవలం మాటల గర్జనతో పని పూర్తి చేయాలనుకోవడం ఆయన వ్యూహంలో భాగం కావొచ్చు.
రెండు వారాల మంత్రం..
ట్రంప్ రాజకీయ శైలిని గమనిస్తే ‘రెండు వారాలు’ అనేది ఆయనకు ఒక మేజిక్ నంబర్ లా కనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా, ఆరోగ్య విధానమైనా, లేదా ఇరాన్ దాడి నిర్ణయమైనా.. ఆయన ఇచ్చే గడువు రెండు వారాలే. ఇది ప్రత్యర్థిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు, తన మద్దతుదారులకు తాను పని చేస్తున్నానని నమ్మించడానికి ఆయన అనుసరించే ఒక విలక్షణమైన పద్ధతి. ఈ స్వల్ప గడువు ద్వారా అవతలి పక్షాన్ని చర్చల మేజా దగ్గరకు రప్పించడంలో ఆయన కొంత వరకు విజయం సాధించారు.
ట్రంప్ హెచ్చరికలు ఇరాన్‌ను భయపెట్టడానికే తప్ప, నిజంగా యుద్ధం చేయడానికి ఉద్దేశించినవి కావని తెలుస్తోంది. అమెరికాను అనవసర యుద్ధాల నుంచి బయటకు తెస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్, మరో యుద్ధంలో దిగి తన పరపతిని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. చమురు ధరలు పెరగకుండా చూడడం, సైనిక వ్యయాన్ని తగ్గించడం ఆయన ప్రధాన లక్ష్యాలు. అయితే, ఇలాంటి ‘తీవ్ర స్థాయిలో హెచ్చరించి మళ్ళీ శాంతించడం’ అనే ధోరణి వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా మాటకు ఉండాల్సిన గాంభీర్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రకమైన ‘బ్లాక్ మెయిల్ డిప్లొమసీ’ లాంటిది. అగ్రరాజ్య నేత ఇంత అస్థిరంగా వ్యవహరించడం వల్ల మిత్రదేశాల్లో అయోమయం, శత్రుదేశాల్లో అలుసు పెరిగే అవకాశం ఉంటుంది.
