Begin typing your search above and press return to search.

ఇరాన్ కు జోల పాడనున్న ట్రంప్... ఎన్ని లక్షల కోట్లతో అంటే..?

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఫలితం సంగతంటే.. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని చెప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 4:00 AM IST
ఇరాన్ కు జోల పాడనున్న ట్రంప్... ఎన్ని లక్షల కోట్లతో అంటే..?
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఫలితం సంగతంటే.. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. అసలు గెలుపు ఇరాన్ ది కాదు, ఇజ్రాయెల్ దీ కాదు.. తన దౌత్యానిది, తమ సైనికులది అని ట్రంప్ చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఇరాన్ ను గట్టి దెబ్బ కొటిన ట్రంప్.. ప్రస్తుతం జోల పాడే పనికి పూనుకోబోతున్నారని అంటున్నారు.

అవును... పశ్చిమాసియాలో భీకరంగా జరుగుతున్న యుద్ధంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన అమెరికా.. ఇరాన్ లోని మూడు కీలక అణుకేంద్రాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... పౌరుల అవసరాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇరాన్‌ కు భారీగా సహకరించే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్‌ కార్యవర్గం పరిశీలిస్తోందని అంటున్నారు.

ఇందులో భాగంగా... టెహ్రాన్‌ కు 30 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.5 లక్షల కోట్లు) సాయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు సీ.ఎన్‌.ఎన్‌. పత్రిక తన తాజా కథనంలో పేర్కొంది. దీంతో.. అణు ఒప్పందానికి సంబంధించి టెహ్రాన్‌ ను ఏవిధంగానైనా చర్చలకు తీసుకువచ్చేలా అమెరికా ప్రయత్నాలు చేస్తోందని.. అందులో భాగంగానే ఈ బుజ్జగింపు వ్యవహరం అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి ఇరాన్‌ లోని అణుకేంద్రాలపై దాడులు నిర్వహించిన మర్నాడే పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌, గల్ఫ్‌ దేశాల ప్రతినిధులతోను ట్రంప్‌ కొన్ని గంటల పాటు వైట్ హౌస్ లో సమావేశం అయ్యారు. అలాగే.. ఇరాన్‌ కు చెందిన కీలక నాయకులతోనూ పలువురు నేతలు ఫోన్‌ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సీజ్ ఫైర్ తర్వాత ఈ చర్చలు కొనసాగుతున్నట్లు సీ.ఎన్‌.ఎన్. వెల్లడించింది.

మరోవైపు అమెరికాతో అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ... అమెరికా చేసిన దాడులు తమ అణుకేంద్రాలకు తీవ్ర నష్టం కలిగించాయని అన్నారు. ప్రస్తుతం.. ఇరాన్‌ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని వెల్లడించారు.