Begin typing your search above and press return to search.

అమెరికా 'అభిమన్యుడు' ట్రంప్ - పద్మవ్యూహంలో అధ్యక్షుడు!

మహాభారత కాలం నాటి ఒక అత్యంత సంక్లిష్టమైన సైనిక వ్యూహం పద్మవ్యూహం. ఒకసారి పద్మవ్యూహంలో ప్రవేశించిన తర్వాత, బయటకు వచ్చే మార్గం తెలియకపోతే ప్రాణ సంకటమే.

By:  Tupaki Political Desk   |   22 March 2026 1:06 PM IST
అమెరికా అభిమన్యుడు ట్రంప్ - పద్మవ్యూహంలో అధ్యక్షుడు!
X

అమెరికా అధ్యక్షుడు అంటే కేవలం ఒక దేశాధినేత మాత్రమే కాదు, ప్రపంచ గమనాన్ని శాసించగల 'సుప్రీం పవర్'. ఒక చిన్న కనుసైగతో ఖండంతరాల అవతల ఉన్న శత్రువులను మట్టికరిపించగలననే ధీమా అమెరికా అధ్యక్షుడి సొంతం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనను ఇదే ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చాలా తాపత్రయపడ్డారు. కానీ ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ఆశలు ఆవిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భయపెట్టి ఇరాన్ ను లొంగదీసుకునే ప్రయత్నం సఫలం కాకపోవడంతో ట్రంప్ దిక్కులు చూస్తున్నారని అంటున్నారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో తేల్చుకోలేక ట్రంప్ ఉత్తుత్తి ఘాండ్రింపులకు దిగుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టారిఫ్ లతో బలమైన మార్కెట్లు ఉన్న భారత్, చైనా వంటి దేశాలను భయపెట్టాలని చూశారు. వెనుజెవెలా, క్యూబా, సోమాలియా వంటి చిన్న దేశాలను బల ప్రయోగంతో లొంగదీసుకున్నారు. ఇదే ఊపులో ఇరాన్ ను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని వ్యూహం రచించారు ట్రంప్. కానీ ఇరాన్ ఎదురుతిరిగింది. ట్రంప్ తో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధంలో అధ్యక్షుడు ట్రంప్ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా విలవిల్లాడిపోతున్నారని అంటున్నారు.

మహాభారత కాలం నాటి ఒక అత్యంత సంక్లిష్టమైన సైనిక వ్యూహం పద్మవ్యూహం. ఒకసారి పద్మవ్యూహంలో ప్రవేశించిన తర్వాత, బయటకు వచ్చే మార్గం తెలియకపోతే ప్రాణ సంకటమే. ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పద్మవ్యూహంతోనే పోల్చుతున్నారు. యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న కొద్ది ట్రంప్ లో నైరాశ్యం, నిరాసక్తత కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఇది పెద్ద విజయంగా కనిపించినా, ఆ తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ప్రతిఘటన ఊహించని ట్రంప్ ఇప్పుడు యుద్ధం ముగింపుపై స్పష్టత లేక అల్లాడిపోతున్నట్లు కనిపిస్తోంది.

తొలుత ఇరాన్ యుద్ధం 4 వారాల్లో ముగుస్తుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని పెంటగాన్ చేతులెత్తిసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ముగించడం తెలియకపోతే ప్రారంభించడానికి అర్థం లేదని వ్యాఖ్యనిస్తున్నారు. ఒకవైపు యుద్ధం ముగింపు దశకు వచ్చిందని తన 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ పోస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో కాల్పుల విరమణకు సిద్ధంగా లేనని చెబుతూ తన అయోమయ స్థితిని ఆవిష్కరిస్తున్నారని అంటున్నారు.

మరోవైపు ఇరాన్ యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. యుద్ధం నుంచి బయటపడే మార్గం ఏంటని అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రంప్‌ను నిలదీస్తోంది. సరైన అనుమతులు లేకుండా యుద్ధానికి వెళ్లారని ఆయనపై విమర్శలు చేస్తోంది. ఇక యుద్ధం కీలక దశలో ఉన్న సమయంలో స్పెయిన్ వంటి దేశాలు తమ వైమానిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీనికి ప్రతిచర్యగా ట్రంప్ ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించడం వల్ల అమెరికా అంతర్జాతీయంగా ఒంటరి అవుతోన్న సంకేతాలు పంపుతున్నాయని అంటున్నారు.

ఇక సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాలు ఈ యుద్ధం తమ ప్రాంతాన్ని నాశనం చేస్తుందని భావిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌కు సహకరించడానికి వెనుకాడుతున్నాయి. ఇదేసమయంలో చమురు ధరల పెరుగుదల ట్రంప్ ను ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ కారణంగా అమెరికాలోనే కాకుండా మిత్రదేశాలైన జపాన్, యూరప్‌లో కూడా ద్రవ్యోల్బణం పెరిగే పరిస్థితులు నెలకొన్నాయనే భయం వ్యక్తమవుతోంది. దీంతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ను దారికి తెచ్చుకునేలా ట్రంప్ ఓ మెట్టు దిగినట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. ఇరాన్ చమురు విక్రయాలపై నిషేధం తొలగించడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.