పాక్ మధ్యవర్తిత్వం: అమెరికా–ఇరాన్ యుద్ధానికి బ్రేక్.. ఇస్లామాబాద్ చర్చలు
ట్రంప్ ప్రకటించిన ఈ కాల్పుల విరమణ కేవలం ఏకపక్షమైనది కాదు. దీని వెనుక అమెరికా కఠినమైన షరతులను విధించింది.
By: A.N.Kumar | 8 April 2026 9:30 AM ISTపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ప్రపంచానికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ నిర్ణయం గత కొద్ది రోజులుగా యుద్ధం అంచుల దాకా వెళ్ళిన అమెరికా-ఇరాన్ సంబంధాల్లో తాత్కాలిక శాంతికి బాటలు వేసింది.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం.. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రక్రియలో పాకిస్తాన్ పోషించిన మధ్యవర్తిత్వ పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. షరీఫ్‌తో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో జరిగిన చర్చలు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి కీలకంగా మారాయి. ఇరాన్‌కు ఇచ్చిన గడువును మరో 14 రోజుల పాటు పొడిగించాలని.. ఈ విరామ సమయంలో దౌత్యపరమైన పరిష్కారాలకు అవకాశం ఇవ్వాలని పాక్ నాయకత్వం కోరినట్లు సమాచారం.
షరతులతో కూడిన శాంతి.. హర్మూజ్ జలసంధి కీలకం
ట్రంప్ ప్రకటించిన ఈ కాల్పుల విరమణ కేవలం ఏకపక్షమైనది కాదు. దీని వెనుక అమెరికా కఠినమైన షరతులను విధించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి అంశంపై ట్రంప్ స్పష్టత ఇచ్చారు. "ఇరాన్ తక్షణమే హర్మూజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం తెరవాలి. ఒకవేళ ఇరాన్ దీనికి అంగీకరించకపోతే ఈ రెండు వారాల కాల్పుల విరమణ గడువు చెల్లదు." అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ దీనిని మూసివేస్తామని హెచ్చరించడంతో గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లు కొంత స్థిరపడే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ఇరాన్ పంపిన పది సూత్రాల ప్రతిపాదనపై కూడా ట్రంప్ సానుకూలంగా స్పందించడం విశేషం.
ఇరాన్ స్పందన.. శాంతి కోసం సిద్ధం కానీ..
అమెరికా ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే ఇరాన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన సయోధ్య ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అయితే ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం దౌత్య చర్చల కోసమేనని, యుద్ధం పూర్తిగా ముగిసినట్లు భావించరాదని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిలో రాకపోకలు పునరుద్ధరించబడినప్పటికీ అవి ఇరాన్ సాయుధ దళాల నిశిత పర్యవేక్షణలోనే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ రెండు వారాల్లో జరిగే చర్చల ఫలితాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని టెహ్రాన్ వర్గాలు తెలిపాయి.
ఏం జరగబోతోంది?
రాబోయే రెండు వారాలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అమెరికా విధిస్తున్న ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా రానున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, దశాబ్దాలుగా నలుగుతున్న అమెరికా-ఇరాన్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి తుపాకులు మూగబోయినప్పటికీ దౌత్య రంగంలో మాత్రం యుద్ధం మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు వాషింగ్టన్, టెహ్రాన్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. శాశ్వత శాంతి ఒప్పందం కుదురుతుందా లేక ఇది కేవలం ఉద్రిక్తతలకు చిన్న విరామమేనా అన్నది వేచి చూడాలి.
