ట్రంప్ తగ్గరు... ఇరాన్ ని కెలికిన ఫలితం !
ఇరాన్ తో పెట్టుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వెనిజులా అధ్యక్షుడిని అర్ధరాత్రి తన సొంత ఇంట్లో భార్యతో కలసి నిద్రిస్తుండగా అమెరికా సైన్యం తీసుకొచ్చి ప్రపంచం ముందు ఘనతగా చెప్పుకుంది.
By: Satya P | 9 July 2026 9:20 AM ISTఇరాన్ తో పెట్టుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వెనిజులా అధ్యక్షుడిని అర్ధరాత్రి తన సొంత ఇంట్లో భార్యతో కలసి నిద్రిస్తుండగా అమెరికా సైన్యం తీసుకొచ్చి ప్రపంచం ముందు ఘనతగా చెప్పుకుంది. అదే ఊపుతో ఉత్సాహంతో ఇరాన్ మీద కూడా విరుచుకుపడింది. పక్కన ఉన్న ఇజ్రాయెల్ ఇచ్చిన సలహాతోనో లేక ప్రపంచ విజేత కావడానికి ఇదే అదను అని భావించిందో తెలియదు కానీ ఇరాన్ తో పెట్టుకుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఇరాన్ కి కెలికింది. మొదటి రోజునే ఇరాన్ ఆధ్యక్షుడిని లేపేసి ఇక ఏముంది ఆ దేశం తమ వశం అనుకుంది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. అమెరికా అనుకున్నది ఒకటి అయితే జరిగింది వేరు అన్నది ప్రపంచం మొత్తం చూసింది. ఫిబ్రవరి నెలాఖరులో మొదలెట్టిన ఈ యుద్ధం ఇపుడు కంటిన్యూ చేయక తప్పేట్లు లేదని ట్రంప్ భావిస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే మరి.
నన్ను చంపేస్తారు అంటూ :
ఈ మాట ట్రంప్ ఇప్పటికి అనేక సార్లు అన్నారు. మరోసారి ఆయన అదే అంటున్నారు. ఇరాన్ మొదటి టార్గెట్ తానేనని తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద కుట్ర పన్ని హత్య చేసే అవకాశం ఇరాన్ తో ఉందని ఆయన చెబుతున్నారు. ఆయన అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ విషయం తీసుకుంటే 1979 నుంచి ఈ రోజు దాకా గత 47 ఏళ్లుగా ఆ దేశం వైఖరి ఏ మాత్రం మారలేదని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ టార్గెట్ లిస్ట్ లో తానే నంబర్ వన్ అని కూడా అన్నారు.
చర్చలు వేస్ట్ అంటూ :
ఇరాన్ తో చర్చలు అంటే టైం వేస్ట్ అని ట్రంప్ తేల్చేశారు. దాని వల్ల ఏ మాత్రం ప్రయోజనం కూడా లేదని అన్నారు. వారితో కాల్పుల ఒప్పందం చేసుకుంటే ప్రతీ రోజూ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ట్రంప్ ఫైర్ అయ్యారు. అందుకే ఇక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ఆయన చెప్పేశారు. ఇరాన్ తో చర్చలు కొనసాగించాలని చర్చల బృందం భావిస్తే కొనసాగించవచ్చని కానీ వాటిపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదని ట్రంప్ పూర్తిగా అసహనం వ్యక్తం చెశారు.
ఇరాన్ ఆగ్రహం :
ఇదిలా ఉంటే తాజాగా అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తమ సైన్యానికి చెందిన ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా తెలిపింది. ఈ దాడులు దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ అలాగే బుషెహర్ ప్రాంతాలలో జరిగాయని చెప్పుకొచ్చింది. ఒప్పందాని అమెరికావే ఉల్లంఘిస్తోంది అని కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మండిపడుతోంది. ఇలా పరస్పరం దాడులకు సిద్ధపడడం తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖమేనీ అంత్యక్రియల సభలో :
మరో వైపు చూస్తే అలీ ఖమేనీ అంత్యక్రియల సభలో అయితే ట్రంప్ ని చంపుతామని నినాదాలు చేస్తూ జనాలు హోరెత్తించారు. హత్యకు గురైన ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ విషయంలో ప్రతీకారంగా ఇరాన్ జనాలు ట్రంప్ ని చంపండి అని నినాదాలు చేస్తూ అమెరికా అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు.అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రంప్‌ను హత్య చేసే లక్ష్యంతో ఇరాన్‌తో సంబంధం ఉన్న ఒక రహస్య కుట్రను అమెరికా న్యాయ శాఖ గతంలో భగ్నం చేసింది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ హత్య కుట్ర ఆరోపణలను అధికారికంగా తోసిపుచ్చి ఖండించినప్పటికీ అమెరికా గూఢచార సంస్థ ట్రంప్ కి వ్యతిరేకంగా వస్తున్న ఈ తరహా బెదిరింపులను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ఒకవేళ ఇరాన్ తనను గానీ తన బృందాన్ని గానీ చంపడానికి ప్రయత్నిస్తే ఆ దేశం సంపూర్ణ నాశనాన్ని ఎదుర్కొంటుందని ట్రంప్ హెచ్చరించడం విశేషం.
