చేయి దాటిపోతున్న లాస్ ఏంజెలిస్.. ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా చేయిదాటిపోతోంది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వలసదారులు రోడ్డెక్కుతున్నారు.
By: Tupaki Desk | 11 Jun 2025 11:34 AM ISTఅమెరికా చేయిదాటిపోతోంది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వలసదారులు రోడ్డెక్కుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. అమెరికాలో వలసదారులపై కఠిన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా లాస్ ఏంజెలిస్ నగరంలో పరిస్థితి అదుపుతప్పుతోంది. నిరసనకారులు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతుండటంతో వాటిని నియంత్రించడానికి నేషనల్ గార్డ్ బలగాలను మోహరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
"నిరసనలు ఆపకపోతే మిలిటరీ బలగాలను రంగంలోకి దించాల్సి వస్తుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకోసం 'ఇన్సరెక్షన్ యాక్ట్ 1807'ను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ చట్టాన్ని ప్రయోగిస్తే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఆర్మీని మోహరించవచ్చు. అయితే, ఈ చట్టం చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించబడింది. ఇప్పుడు మళ్లీ దాన్ని ప్రయోగించనున్నారనే విషయంపై అమెరికాలో పెద్ద చర్చ మొదలైంది.
లాస్ ఏంజెలిస్ నగర అధికారులు ఇప్పటివరకు 100 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. దుకాణాలను ధ్వంసం చేయడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అయితే, ట్రంప్ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ నేతలు, పౌరహక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆర్మీని మోహరించడం ద్వారా పరిస్థితి మరింత ముదుర్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య, అమెరికాలోని వివిధ నగరాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు న్యాయం, సమానత్వం కోసం గళమెత్తుతుండగా, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ప్రశ్నలు పెరుగుతున్నాయి. అమెరికాలో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.