'ఐ లవ్ పాకిస్థాన్'... ఆ విషయంలో మోడీ చెప్పినా ట్రంప్ నోట పాత పాట!
ఈ సమయంలో ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ 'ఆ విషయంలో అమెరికా ప్రమేయం లేదని' స్పష్టంగా చెప్పారు! అయినా ట్రంప్ మారలేదు..పాత పాట వీడలేదు!
By: Tupaki Desk | 18 Jun 2025 10:33 PM ISTభారత్ – పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని.. ఆ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం వెనుక అమెరికా మధ్యవర్తిత్వం ఉందని ఇప్పటికే పలుమార్లు, పలు వేదికలపై ప్రకటించుకున్నారు ట్రంప్. ఈ సమయంలో ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ 'ఆ విషయంలో అమెరికా ప్రమేయం లేదని' స్పష్టంగా చెప్పారు! అయినా ట్రంప్ మారలేదు..పాత పాట వీడలేదు!
అవును... ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం, వాణిజ్య ప్రస్థావన లేదని ఫోన్ కాల్ లో ట్రంప్ కు మోడీ స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే.. ట్రంప్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. ఈ సందర్భంగా తాను పాక్ ను ప్రేమిస్తున్నానని చెబుతూ.. మోడీని అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ కొనియాడారు.
"ఐ లవ్ పాకిస్థాన్.. మోడీ అద్భుతమైన వ్యక్తి... నిన్న రాత్రి ఆయనతో మాట్లాడాను.. మేం భారత్, మోడీతో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం" అని మొదలుపెట్టిన ట్రంప్... "పాకిస్థాన్ - భారత్ ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి. పాకిస్థాన్ వైపు మునీర్, భారత్ తరఫున మోడీ తదితరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారు.. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను" అని మీడియాతో ట్రంప్ పేర్కొన్నారు.
కాగా... భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. పైగా... ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ముందుగా ప్రకటించడంతో చాలా మంది నమ్మారు కూడా! దీనిపై మోడీ సర్కార్ స్వదేశంలో తీవ్ర విమర్శలు, పలు ప్రశ్నలు ఎదుర్కోంది. అయితే.. దీనిపై మోడీ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భాగంగా... పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో "భారత్ - అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని.. సీజ్ ఫైర్ గురించి భారత్ - పాక్ మధ్య మిలటరీ స్థాయి చర్చలు మాత్రం జరిగాయని" మోడీ తెలిపారని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
"పాకిస్థాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సిందూర్ ను నిలిపివేశాము.. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోడీ స్పష్టంగా చెప్పారు.. ఈ విషయంపై భారత్ లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉంది" అని మిస్రీ వివరించారు. అయినప్పటికీ... ట్రంప్ మళ్లీ పాతపాటే పాడటం గమనార్హం.
