పరువు మొత్తం పోయిందిగా.. ట్రంప్ గాలి తీసేస్తున్న భారతీయులు!
భారత్ - పాక్ మధ్య గత కొన్ని రోజులుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు శనివారం సాయంత్రం నుంచి చల్లబడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 4:27 PM ISTభారత్ - పాక్ మధ్య గత కొన్ని రోజులుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు శనివారం సాయంత్రం నుంచి చల్లబడిన సంగతి తెలిసిందే. అందుకు కారణం తామే అని.. ఆ మధ్యవర్తిత్వలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని.. ఈ సమయంలో ఇరు దేశాలు మంచి నిర్ణయం తీసుకున్నాయని ట్రంప్ తెలిపారు. అప్పటికే పలువురు భారతీయులు రగిలిపోతున్నారని అంటున్నారు.
ఈ సమయంలో మరో విషయంపై స్పందించారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా.. ఇరు దేశాలతో కలిసి కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్ప ఏమీ లేవని భారత్, పాక్ లోని శక్తివంతమైన నాయకత్వాలు అర్ధం చేసుకున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే.. కశ్మీర్ విషయంలో పరిష్కారాన్ని మీరు కనుక్కోగలిగితే మీతో కలిసి పనిచేస్తానని ట్రంప్ అన్నారు. దీంతో.. భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా... ఏదైనా చేయాలనుకుంటే మీకున్న సామర్థ్యంతో ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు సహకరించాలని.. అంతే తప్ప, భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని సూచిస్తున్నారు.
కాల్పుల విరమణలో తందానతాన అన్నారని ఇక అన్ని విషయాల్లోనూ వేలు పెట్టేస్తామంటే సహించమని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే అని, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో భారతీయులకు బాగా తెలుసని నెటిజన్లు అమెరికా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు.
పాకిస్థాన్ లో తుపాకులతో సంబరాలు!:
భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం తమ విజయమని, చారిత్రక విజయమని, పాకిస్థాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, భారత్ కు తగిన బుద్ది చెప్పామని, తమ జోలికి వస్తే ఏం చేయగలమో చేసి చూపించామని చెప్పుకుంటున్నారు పాక్ ప్రధాని! దీంతో.. ఆ దేశంలో ప్రజలు భారత్ పై గెలిచామనే ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు!
ఇందులో భాగంగా... పాకిస్థాన్ వీధుల్లో కొంతమంది రాకెట్ లాంచర్లు, ఏకే-47 తుపాకులు చేతపట్టి ర్యాలీలు తీస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని అంటున్నారు! దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది పాకిస్థాన్ ఒరిజినల్ స్వరూపం అని.. ఇది తెలిసి కూడా ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో.. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు, వారికి మద్దతు తెలుపుతున్న ప్రభుత్వం ఎంత ప్రమాదకరమో తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడే ట్రంప్ కు తెలిసి ఉంటుంది కదా.. అయినప్పటికీ కొత్తగా ఒత్తాసు పలకడం ఏమిటి... అందుకు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా భారత్ తలాడించడం ఏమిటని మండిపడుతున్నారు!
