పాక్ ఒత్తిడికి ట్రంప్ లొంగిపోయారా.. వాజపేయి ప్రకటన చూడలేదా?
భారత్, పాక్ మధ్య జరుగుతున్న వార్ లో అమెరికా జోక్యానికి పాక్ కారణమనే కొత్త కథనాలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 12 May 2025 3:02 PM ISTఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ లో దాక్కొన్న ఉగ్రవాదులను వణికించేసిన సంగతి తెలిసిందే. దీంతో.. భారత్ పై ప్రతీకారానికి దిగింది పాక్. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకోంది. ఈ సమయంలో శనివారం సాయంత్రం ట్రంప్ నుంచి ఊహించని రీతిలో అన్నట్లుగా ఓ ప్రకటన వచ్చింది.
ఇందులో భాగంగా... భారత్ - పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, దానికి కారణం అమెరికా మధ్యవర్తిత్వమే అని ట్రంప్ తెలిపారు. అయితే... అప్పటివరకూ భారత్ - పాక్ ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం చేస్తుందనే విషయం బయటకు రాలేదు! దీనిపైనే ఇప్పుడు మోడీ సర్కార్ ని కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేసింది! సిమ్లా ఒప్పందం సంగతేమని నిలదీస్తుంది.
మరోపక్క... భారత్ - పాక్ ల మధ్య కాల్పుల విరమణ గురించి ట్రంప్ ప్రకటించడంపైనా అటు విపక్షాలతో పాటు ఇటు భారత ప్రజానికం కూడా ఫైర్ అవుతుంది! అమెరికా మహారాజు అన్నట్లు.. భారత్, పాక్ లు సామంత రాజ్యాలు అన్నట్లుగా వ్యవహారం ఉందనే కామెంట్లూ వినిపించాయి! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఓ బ్లాక్ మెయిల్ వ్యవహారం తెరపైకి వచ్చింది!
అవును... భారత్, పాక్ మధ్య జరుగుతున్న వార్ లో అమెరికా జోక్యానికి పాక్ కారణమనే కొత్త కథనాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా.. భారత్ దెబ్బకు తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ.. అణుప్రయోగం చేయాల్సి వస్తుందని ట్రంప్ వద్ద పాకిస్థాన్ చెప్పిందని.. ఆ మేరకు ఒత్తిడి కమ్ బెదిరింపులకు దిగిందని అంటున్నారు.
దీంతో... పాక్ ఒత్తిడికి, బెదిరింపులకు ట్రంప్ లొంగిపోయారని.. ఆ మేరకు మోడీని ఒప్పించారని.. దీంతో ఈ విషయాన్ని ట్రంప్ హడావిడిగా ప్రకటించేశారని అంటున్నారు. మరోవైపు.. రెండు సార్వభౌమ స్వతంత్ర దేశాల మధ్య కాల్పుల విరమణ గురించి మూడో దేశం ప్రకటించడం అంటే.. ఆ రెండు దేశాలు మూడో దేశానికి ఎంత లొంగిపోయాయో అర్ధం అవుతుందనే చర్చ!
ఇది వాస్తవమా కాదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... అటు ట్రంప్ అయినా, ఇటు పాక్ అయినా.. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చెప్పిన ఓ మాట గుర్తుంచుకోవాలని అంటున్నారు పరిశీలకులు! ఇందులో భాగంగా... "పాకిస్థాన్ అణు బాంబు వేస్తే భారత్ కు కాస్త ఇబ్బందే అవ్వొచ్చేమో కానీ.. ఆ తర్వాత పాకిస్థాన్ సూర్యోదయాన్ని చూడదు అని"!!
అందువల్ల... ఇది పాక్ బెదిరింపో, మోడీ అదిరింపో కాదు కానీ... ఈ ఇరు దేశాలను సామంత రాజ్యాలు అన్నట్లుగా చేస్తూ పెత్తనం చెలాయించాలనే ట్రంప్ పెద్దన్న మనస్థత్వమే ఈ కాల్పుల విరమణకు ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకే సారి ఆ కన్నుతో పాక్ కు, ఈ కన్నుతో భారత్ కు కన్నుమీటగల నైపుణ్యం ట్రంప్ సొంతమని చెబుతున్నారు!
