Begin typing your search above and press return to search.

'భారత్ – పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు'.. ట్రంప్ కొత్త మాట!

తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ఇచ్చిన విందు అనంతరం ఓవల్ ఆఫీసులో ట్రంప్ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 11:25 AM IST
భారత్ – పాక్  యుద్ధాన్ని ఆపింది నేను కాదు.. ట్రంప్  కొత్త మాట!
X

ఆయన ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైనదిగా చెప్పే దేశానికి అధినేత. మరింత సూటిగా చెప్పాలంటే.. అగ్రరాజ్యం అధినేత. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అలాంటి నేత మాట.. సూటిగా, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండాలి. అన్నింటికంటే ముందు వాస్తవమై ఉండాలి. కానీ... ట్రంప్ ఆ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ కామెంట్లకు తాజాగా ఆయన బలం చేకూర్చారు!

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన తొలి ప్రకటన ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెలువడింది. దీంతో... భారత్ లో మారిన పరిణామాల సంగతి అలా ఉంచితే.. ట్రంప్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

ఆ సందర్భంగా స్పందించిన ట్రంప్... భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనని పదేపదే, పలు రకాల వేదికలపై ప్రకటించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి మాట్లాడిన ట్రంప్‌.. ఎట్టకేలకు మోడీ వ్యాఖ్యలతో ఏకీభవించారు.. భారత్‌-పాక్‌ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని అన్నారు.

తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ఇచ్చిన విందు అనంతరం ఓవల్ ఆఫీసులో ట్రంప్ మాట్లాడారు. ఈ సమయంలో మునీర్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు (మోడీ, మునీర్ లను ఉద్దేశిస్తూ!).. యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారని.. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేవే అని తెలిపారు.

ఆ రెండూ అణుశక్తి కలిగిన దేశాలని.. అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు. అంతేగాక.. భారత్‌, పాకిస్థాన్‌ తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా... జీ7 సదస్సు నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ట్రంప్ తో మోడీ సుమారు 35 నిమిషాలు ఫోన్ లో మాట్లాడారు. ఆ చర్చల్లో ట్రంప్ కు ఈ విషయంపై మోడీ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ట్రంప్‌ తొలుత పాత పాటే పాడారు. "పాకిస్థాన్‌ పై తనకు ప్రేమ ఉందని.. మోడీ అద్భుతమైన వ్యక్తి అని భావిస్తున్నట్లు చెబుతు... యుద్ధాన్ని తానే ఆపినట్లు ప్రకటించారు. ఆ తర్వాత 24 గంటలు గడవకముందే వెనక్కి తగ్గారు!