Begin typing your search above and press return to search.

మెలానియా టార్గెట్: ట్రంప్ వ్యాఖ్యలతో ఉద్యమానికి వేడి

ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ఉద్యమం, అమెరికాలో వలస విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది.

By:  Tupaki Desk   |   2 July 2025 10:18 PM IST
మెలానియా  టార్గెట్: ట్రంప్ వ్యాఖ్యలతో ఉద్యమానికి వేడి
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే వ్యతిరేకంగా మారుతున్నాయి. అమెరికా పౌరులైన కొంతమందిని కూడా బహిష్కరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. తాజా పరిణామాల్లో ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్‌ను అమెరికా నుంచి బహిష్కరించాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున పిటిషన్ ఉద్యమం నడుస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలపై వ్యతిరేకత

"నేచురలైజ్డ్ సిటిజన్లను కూడా అమెరికా నుంచి బహిష్కరించాలి" అనే ట్రంప్ వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలో పౌరసత్వం పొందిన ఎంతో మంది వలసదారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిన ఈ వ్యాఖ్యలు, ఆయన కుటుంబంపైనా అదే నియమాలు వర్తించాలన్న డిమాండ్లకు దారితీశాయి.

MoveOn.org ప్రారంభించిన పిటిషన్

ప్రముఖ పబ్లిక్ పాలసీ అడ్వకసీ గ్రూప్ MoveOn.org మొదలు పెట్టిన పిటిషన్‌లో మెలానియా ట్రంప్‌ను అమెరికా నుంచి బహిష్కరించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ఈ పిటిషన్‌కు సంతకాలు చేస్తున్నారు. "ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం, మెలానియా, ఆమె తల్లిదండ్రులు, బారన్ ట్రంప్‌ కూడా అమెరికా నుంచి వెళ్లిపోవాలి. ఎందుకంటే వారు పుట్టిన ప్రదేశాలు అమెరికాకు బయటివే. ట్రంప్ విధానం ప్రకారం ఎవరికి మినహాయింపులు ఉండకూడదు" అని ఈ పిటిషన్ పేర్కొంది.

-మెలానియాకు పౌరసత్వం ఎలా?

మెలానియా ట్రంప్ అసలు పేరు మెలానిజా క్నావ్స్. ఆమె 1970లో యుగోస్లేవియాలో జన్మించారు. 1996లో మోడలింగ్‌లో అవకాశాల కోసం అమెరికాకు వచ్చారు. 2001లో గ్రీన్‌కార్డ్ పొందిన ఆమె, 2006లో అమెరికా పౌరురాలిగా మారారు. అమెరికా వెలుపల జన్మించిన రెండవ ప్రథమ మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.

-వీసా చట్టాల ఉల్లంఘనా?

మెలానియా అమెరికాకు మోడలింగ్ కోసం వచ్చినప్పుడు ఆమె వీసా చట్టాలకు అనుగుణంగా ఉన్నదా అనే అనుమానం ఇటీవల ప్రజల మధ్య చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ సభ్యురాలు మాగ్జిన్ వాటర్స్ దీనిపై స్పందిస్తూ "వలసదారుల పత్రాలను ట్రంప్ పరిశీలించాలనుకుంటే, ముందు తన భార్య మెలానియా పత్రాలనే ప్రజలముందు ఉంచాలి" అని డిమాండ్ చేశారు.

-ట్రంప్ కుటుంబం టార్గెట్ గా మారుతోందా?

ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ఉద్యమం, అమెరికాలో వలస విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. పౌరసత్వం, వీసా, వలసదారుల హక్కులపై నిబంధనలు ఎవరికైనా సమానంగా ఉండాలని, శక్తివంతుల కుటుంబాలకు మినహాయింపులు ఉండకూడదనే సందేశంతో ఈ ఉద్యమం ముదురుతోంది.

ట్రంప్ తీసుకున్న వలస విధానాలు ఇప్పుడు ఆయన సొంత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తిరుగుతుండటం, అమెరికా రాజకీయాల్లో ఓ ఆసక్తికర మలుపుగా మారింది. మెలానియా పౌరసత్వంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమం ట్రంప్ రాజకీయ భవితవ్యం మీద ప్రభావం చూపనుందా అనే ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.