Begin typing your search above and press return to search.

ఇమిగ్రేషన్ వ్యథలు : ట్రంప్‌కు ఓటు వేసిన భర్త.. భార్య నిర్బంధం

చట్టాల అమలులో తగ్గేదేలే అని ట్రంప్ ముందుకెళుతున్నాడు. అసలు అమెరికన్లు కాని వారిని.. సరైన పత్రాలు చూపించకుంటే ఆ దేశంలోకి అడుగుపెట్టనీయడం లేదు

By:  Tupaki Desk   |   19 March 2025 8:36 AM IST
ఇమిగ్రేషన్ వ్యథలు : ట్రంప్‌కు ఓటు వేసిన భర్త..  భార్య నిర్బంధం
X

చట్టాల అమలులో తగ్గేదేలే అని ట్రంప్ ముందుకెళుతున్నాడు. అసలు అమెరికన్లు కాని వారిని.. సరైన పత్రాలు చూపించకుంటే ఆ దేశంలోకి అడుగుపెట్టనీయడం లేదు. గ్రీన్ కార్డ్ కోసం ఇతర శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకొని అమెరికాలో ఉంటున్న వారైనా సరే దేశంలోకి నో ఎంట్రీ అంటున్నారు. ఎవరైతే ట్రంప్ విధానాలకు ఆకర్షితులై ఓటు వేశారో వారికే ఇప్పుడు ఈ నిబంధనలు పెనుశాపమవుతున్నాయి.. ట్రంప్ కు ఓటు వేసిన వ్యక్తి భార్యనే ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన స్టోరీ అక్కడ నిబంధనలు ఏమేరకు కఠినంగా ఉన్నాయో కళ్లకు కడుతున్నాయి..

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు అనేక మందికి పీడకలగా మారుతోంది. అమెరికా పౌరులను వివాహం చేసుకున్న మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. ఒక షాకింగ్ ఘటనలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను సమర్ధించిన ఒక అమెరికన్ వ్యక్తి తన భార్యనే ఇమిగ్రేషన్ అధికారులు లక్ష్యంగా చేసుకుంటారని కలలో కూడా ఊహించలేదు.

బ్రాడ్లీ బార్టెల్ అనే ట్రంప్ మద్దతుదారుడు తాజాగా తన ఆవేదన వెళ్లగక్కాడు. ట్రంప్ ప్రచారంలో చెప్పిన "నేరపూరిత అక్రమ వలసదారులను" తొలగిస్తామనే వాగ్దానాన్ని నమ్మాడు. కానీ ఇప్పుడు అదే అతడికి శాపమైంది. బ్రాడ్లీ భార్య కామిలా మునోజ్ చట్టబద్ధంగా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను నిర్బంధించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

బార్టెల్ - మునోజ్ లు ఇద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వారు వివాహం చేసుకున్నారు. వారు తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటూ ఒక ఇల్లు కోసం డబ్బు ఆదా చేస్తూ జీవిస్తున్నారు. వీరిద్దరికీ 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సంసారం హాయిగా సాగుతోంది. కానీ గత నెలలో ప్యూర్టో రికోలో హనీమూన్ నుండి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఆపడంతో వారి కలల జీవితం ఒక్కసారిగా ఛిద్రమైంది.

"మీరు అమెరికా పౌరురాలా?" అని ఒక అధికారి మునోజ్‌ను అడిగాడు. ఆమె నిజాయితీగా సమాధానం చెప్పింది.. లేదు, తాను పెరూకు చెందిన దానినని.. ఇప్పటికే చట్టబద్ధమైన స్థితి పొందే ప్రక్రియలో ఉన్నట్టు పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా ఆమెను ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు.

మునోజ్ ఒక్కరే కాదు.. నేర చరిత్ర లేకపోయినా, చట్టబద్ధంగా నివాసం కోసం దరఖాస్తు చేసుకుంటున్న అనేక మంది మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో నిర్బంధించబడ్డారని నివేదికలు చెబుతున్నాయి.

పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ కలవరపరిచే సంఘటనలపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు మౌనం వహిస్తున్నారు. ట్రంప్ కు ఓటేసిన ఆయన మద్దతుదారులకు కూడా ఇప్పుడు అధ్యక్షుడు పెట్టిన నిబంధనలు పెనుశాపంగా మారడం చూసి వారంతో బోరుమంటున్నారు. దీంతో ట్రంప్ విధానాలపై మరోసారి అమెరికా సమాజంలో చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలతో ఆందోళన ఎక్కువవుతోంది.