Begin typing your search above and press return to search.

వలసదారులపై మరింత కఠిన చర్యలు.. ట్రంప్ నెక్స్ట్ నిర్ణయం ఏమిటంటే..?

ఈ నేపథ్యంలోనే వలసదారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేయాలన్న లక్ష్యాలను చేరుకోలేక అమెరికా ఫెడరల్‌ అధికారులు ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 4:30 PM IST
వలసదారులపై మరింత కఠిన చర్యలు.. ట్రంప్  నెక్స్ట్  నిర్ణయం ఏమిటంటే..?
X

రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ.. అమెరికాలో ఉన్న వలసదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు ట్రంప్ అనే విషయం తెలిసిందే! ఈ ఇక్రమంలో తాజాగా వారిపై మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సీ.ఎన్.ఎన్. తన తాజా కథనంలో దీనికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది.

అవును... తమదేశంలో ఉన్న వలసదారులపై మరింత కఠిన చర్యలకు ట్రంప్‌ కార్యవర్గం సిద్ధమవుతోందని.. ఇందులో భాగంగా.. లక్షలాది శరణార్థి దరఖాస్తులను తిరస్కరించి వారిని వేగంగా దేశం నుంచి బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోందని.. అమెరికాకు వచ్చి రక్షణ పొందే వలసదారులను అడ్డుకొనేందుకు ఈ చర్యలు తీసుకొంటుందని.. ఆ కథనం వెల్లడించింది.

వాస్తవానికి గత పదేళ్లలో అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రెంట్‌ సర్వీసెస్‌ (యూఎస్‌.సీ.ఐ.ఎస్‌) ను ఆశ్రయం కోరిన వారిలో కనీసం 25 శాతం మంది అక్రమంగా దేశంలో ప్రవేశించినవారే అని అంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలను 2023 ఫెడరల్‌ రిపోర్టు వెల్లడించింది. ఈ విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వలసదారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేయాలన్న లక్ష్యాలను చేరుకోలేక అమెరికా ఫెడరల్‌ అధికారులు ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు. దీంతో మరింత మందిని డిపోర్టేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకే కొత్తగా ఈ చర్యలు చేపడుతున్నట్లున్నారని చెబుతున్నారు. దీంతో లక్షల మంది శరణార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారనుందని అంటున్నారు.

కాగా... స్వదేశాల్లో అణచివేత, హింసకు గురైన వారు అమెరికా చట్ట ప్రకారం ఆశ్రయం కోరవచ్చనే సంగతి తెలిసిందే. అయితే.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి వచ్చి ఆశ్రయం కోరేవారిని పూర్తిగా అడ్డుకొన్నారు. ఈ క్రమంలో... ప్రస్తుతం అమెరికా ఏజెన్సీల వద్ద సుమారు 14.5 లక్షల శరణార్థుల దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయని సమాచారం.