నిన్న వెట్టింగ్...నేడు వెయిటెడ్...ఇదేం ఖర్మరా ట్రంపూ...
హెచ్1బీ వీసా ఇవ్వడానికి ఇపుడు సవాలక్ష ఆంక్షలు తయారయ్యాయి. రోజుకో కొత్త నిబంధన వీసా మెడకు చుట్టుకుంటోంది.
By: Tupaki Desk | 23 Dec 2025 5:38 PM ISTఇండియన్స్ ఇక డాలర్స్ డ్రీమ్ నుంచి బైటికి రావల్సిందే. కలలు కనండి...వాటిని నిజం చేసుకోండి అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారే...కానీ ఇకపై డాలర్ల కలలు పగటి కలలే అయ్యేలా ఉన్నాయి. ఎప్పుడు చాన్స్ దొరికితే అప్పుడు యూఎస్ కు తుర్రుమందామని చాలా మంది అనుకుంటుంటారు. ఇంతకాలం ఆ ఆట సాగింది. కానీ ఇపుడు అక్కడ యముడికి మొగుడులా ...వలసదారులకు అసలైన మొగుడు ట్రంప్ తయారయ్యాడు. అతడు ఇమ్మిగ్రెంట్స్ ఉచ్చు నుంచి అమెరికాను విముక్తి చేయాలని కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నాడు. రోజుకో రూల్ తెరపైకి తెస్తున్నాడు. హెచ్1బీ వీసా దరఖాస్తు చేసుకున్నా...అది వస్తుందో లేదో అన్న అనుమానాల నీడలు కమ్మేస్తున్నాయి. అమెరికా వెళ్ళడం...చదువుకోవడం...ఉజ్జోగం కొట్టేయడం...ఇండియాకు టాటా చెప్పేయడం...ఈ వలస ఫార్ములాకు ఇక నూకలు చెల్లినట్టే.
హెచ్1బీ వీసా ఇవ్వడానికి ఇపుడు సవాలక్ష ఆంక్షలు తయారయ్యాయి. రోజుకో కొత్త నిబంధన వీసా మెడకు చుట్టుకుంటోంది. ఫేస్ బుక్ లో...ఎక్స్ లో, ఇన్ స్టాలో ఇష్టారీతిగా పోస్టులు పెడుతూ...సోషల్ మీడియాను ఇది నా అడ్డా..నాకెవరు అడ్డు అనుకుంటుంటే...మీరు దయచేసి అమెరికా సంగతి మరచిపోండి. పోనీ పద్ధతిగా ఈ హ్యాండిల్స్ వాడుతున్నా...అమెరికా అధికారులకో...స్క్రీనింగ్ కమిటీకో నచ్చకపోతే మీ వీసా ఇంతే సంగతులు చిత్తగించవలెను. దీనికి వెట్టింగ్ అని ముద్దు పేరు పెట్టారు కూడా. పేరు ఏదైతేనేం వంక చెప్పడానికో నెపం కావాలి....అదే ట్రంపుడు బూతద్దం వేసి మరీ వెదుకుతుంటాడు.
హెచ్1బీ వీసాదారులపై ఆయనగారికి అపారమైన డౌటనుమానాలు. దీనికి తగ్గట్టుగానే మనవాళ్ళది గుడారం ఒంటె కథలా మారిపోయింది. ఎడారిలో చలికి తట్టుకోలేక గుడార యజమానిని బతిమాలి ముక్కు దూర్చేంత స్థలం అడిగి గుడారాన్నే ఆక్రమించి యజమానిని బైటికి పంపిన కథ మనకు తెలుసు కదా. ఈ హెచ్1బీ వీసాదారులు కూడా ఎక్కడ ఒంటెలా తయారై అమెరికాను కబ్జా చేసేస్తారో అని అమెరికన్లకు భయం పట్టుకుంది. ట్రంపు ఆ భయాన్ని బాగా పెంచి పోషిస్తున్నాడు. ఎందుకంటే అదే ఓటుబ్యాంకును తెరిచే మంచి కీ అని అతగాడి నమ్మకం.
ఇపుడు హెచ్1బీ వీసా ఎంపికకు మరో కొత్త రూలు తెరపైకి వచ్చేసింది. అదే వెయిట్ చూడ్డం. అంటే జీతం బరువు చూడ్డం అనమాట. నైపుణ్యం,వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనల్ని ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తోంది. సాధారణంగా ఫెడరల్ నిబంధనల మార్పుల ప్రక్రియలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ దే చివరి సమీక్ష.ఇక్కడ ఓకే సీలు పడిన వీసాలనే ఆధికారికంగా ప్రకటిస్తారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమీక్షను పూర్తి చేసి తుది నిబంధనలకు సంబంధించిన కాపీని విడుదల చేయనున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది నుంచే హెచ్1బీ వీసా జారీకి ఈ కొత్త నిబంధన యాడ్ అవుతుంది.
ఇప్పటి దాకా హెచ్1బీ వీసా జారీకి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానాన్ని అమలు చేస్తుండగా...కొత్తగా ఇపుడు వెయిటెడ్ సెలెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. అంటే కేవలం నిపుణులైన లేబర్స్ మాత్రమే అమెరికాకు వచ్చేలా ఆ దేశం జాగ్రత్తలు తీసుకుంటోంది. హెచ్1బీ వీసా ముసుగులో లాటరీ ద్వారా ఎవరు పడితే వారు రావడానికి ఇక కుదరదు. ఎందుకంటే ఈ లాటరీ పద్ధతి తీసేసి...నైపుణ్యం, వేతనం ఆధారిత లాటరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కంపెనీ ఆఫర్ చేసిన శాలరీ ఆధారంగా రిజిస్ట్రేషన్లుంటాయి. త్వరలో ఈ వేతనాల శ్లాబ్ లను కూడా రూపొందించనున్నారు. ఇదే నిజమైతే...ఇకమీదట అమెరికాకు వెళ్ళాంటే...కేవలం ఘనంగా చెప్పుకోవడం కాదండోయ్...వేతనాలు కూడా భారీగా ఉండాలి మరి.
