అమెరికాలోకి ప్రవేశంపై ట్రంప్ కొరడా.. మళ్ళీ 12 దేశాలపై నిషేధం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 10:56 AM ISTఅమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై ఆయన బుధవారం సంతకం చేశారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో యూదులపై బాటిల్ బాంబులతో దాడి జరిగిన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిషేధ జాబితాలో 12 దేశాలు
ఈ నిషేధ జాబితాలో అఫ్ఘానిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియ, ఎరిట్రియా, హైతీ , లిబియా, సోమాలియా, సూడాన్ ఉన్నాయి. కాగా, బురుండి, క్యూబా, లావోస్ , సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్ , వెనిజులా వంటి మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
దేశ భద్రతే లక్ష్యం
ట్రంప్ ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ.. "కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఒక ఉగ్రదాడి జరిగింది. దేశంలో సరైన పత్రాలు లేని విదేశీయుల ఉనికి వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి. 2017లో యూరప్‌లో జరిగిన సంఘటనలు అమెరికాలో జరగడానికి మనం అనుమతించం. సురక్షితంగా లేని దేశాల నుండి బహిరంగ వలసలను మనం ఇకపై అనుమతించలేము. అందుకే ఈరోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించే ఆదేశాలపై నేను సంతకం చేస్తున్నాను" అని తెలిపారు.
ట్రంప్ తన మొదటిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆయన 2017లో యూరప్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు. ట్రంప్ ఈ ప్రకటనపై వెనిజులా మంత్రి డియోస్డాడో కాబెల్లో స్పందించారు. అమెరికాలో ఉండటం వెనిజులా ప్రజలకు మాత్రమే కాదని, అందరికీ ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో విభేదాలు
ట్రంప్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటీవల మరో కీలక ఆదేశాలపై సంతకం చేశారు. విశ్వవిద్యాలయంలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలపై ఈ ఆదేశం ఆంక్షలు విధిస్తుంది. "అమెరికన్ ప్రయోజనాలకు హాని కలిగించే వారు మాకు వద్దు. హార్వర్డ్ అలాంటి వారికి నిలయంగా మారింది" అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ తాజా ఆదేశం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మాత్రమే వర్తిస్తుందని, దేశంలోని ఇతర విద్యాసంస్థలకు కాదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలు అంతర్జాతీయ సంబంధాలు, వలస విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి.
