Begin typing your search above and press return to search.

'పాక్ ఐ లవ్ యు'.. భారత్ పై ట్రంప్ వ్యూహం ఇదేనా?

వాస్తవానికి ఏ విధంగా చూసినా పాకిస్థాన్ కు అమెరికా అవసరం ఉంది! పాకిస్థాన్ అనొచ్చు.. "ఐ లవ్ అమెరికా" అని, "9/11 దాడులు మరిచిపోమని"!

By:  Tupaki Desk   |   19 Jun 2025 12:25 PM IST
పాక్  ఐ లవ్  యు..  భారత్  పై ట్రంప్  వ్యూహం ఇదేనా?
X

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో.. ఇజ్రాయెల్ కు అమెరికా పూర్తి మద్దతు ఉండగా.. ఇరాన్ కు పాకిస్థాన్ తన మద్దతు తెలిపింది. ఈ సమయంలో.. ముస్లిం కంట్రీలన్నీ ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను పిలిచి విందు ఇచ్చారు ట్రంప్.. అంతే కాదు.. పాక్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని కొనియాడారు.

అవును.. మునీర్ ను ట్రంప్ కొనియాడారు. అంతవరకూ బాగానే ఉంది కానీ... ఈ గ్యాప్ లో "ఐ లవ్ పాకిస్థాన్" అని అన్నారు ట్రంప్. దీంతో... 'ట్రంప్ మరీ అంత దిగజారాల్సిన అవసరం ఏముంది?' అనే మాటలు నెట్టింట వినిపించాయి.! ట్రంప్ గతం మరిచిపోయారా.. లేక, మనసులో మరో లక్ష్యం పెట్టుకుని ఈ విధంగా పాక్ తో ప్రేమ నటిస్తున్నారా? అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.

వాస్తవానికి ఏ విధంగా చూసినా పాకిస్థాన్ కు అమెరికా అవసరం ఉంది! పాకిస్థాన్ అనొచ్చు.. "ఐ లవ్ అమెరికా" అని, "9/11 దాడులు మరిచిపోమని"! అంతే కానీ... అమెరికా పౌరుల ఉసురుతీసిన పాముకు ఆశ్రయం కల్పించి, పెంచి పోషించిన పాకిస్థాన్ ను అమెరికా అధ్యక్షుడు అంత గాఢంగా ప్రేమించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది సగటు వ్యక్తి సందేహం. అలా అని ఇవ్వన్నీ ట్రంప్ కు తెలియదా? అంటే... తెలుసు!

ట్రంప్.. రాజకీయ నాయకుడు కాకముందు.. ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్! ఆల్ మోస్ట్ 20ల్లోనే ట్రంప్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు! దశాబ్ధాలుగా ఆయన మస్తిష్కం.. వ్యాపార కోణంలో ఆలోచించి ఆలోచించి ఉంది. దీంతో... దాని తాలూకు నిక్షిప్తాల ప్రభావం.. అమెరికాకు అధ్యక్షుడైనప్పటికీ పోయే అవకాశం లేదు! దీంతో.. ప్రతీ విషయాన్ని వాణిజ్య కోణంలోనే చూస్తున్నారు ట్రంప్!

ఏమైనా అడిగితే... "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అంటున్నారు. అది పూర్తిగా డబ్బుతోనే వస్తుందనేది ట్రంప్ జ్ఞానం అయ్యి ఉండొచ్చు! కానీ.. అగ్రరాజ్యం అన్నతర్వాత దానికి కొన్ని పరువులు, బాధ్యతలు, కొన్ని లెక్కలు, మరికొన్ని నిబంధనలు ఉంటాయి.. హుందాతనం అతి ముఖ్యమై ఉంటుంది! కానీ... వాణిజ్యం ముసుగులో ట్రంప్ ఎంతకైనా దిగిపోతున్నట్లు కనిపిస్తోంది!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈ ప్రపంచంలో రెండు దేశాలతో వాణిజ్యం అతి ముఖ్యం. వాటిలో ఒకటి భారత్ కాగా మరొకటి చైనా. చైనా సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి, అభివృద్ధి చెందుతూ, ఆర్థికంగా టాప్ 4లో ఉన్న భారత్ లాంటి దేశంతో అమెరికా వాణిజ్యం చేస్తే... సుమారు 50 నుంచి 100 చిన్న దేశాలతో చేసినట్లే!

వాస్తవానికి... అధికారంలో ఏపార్టీ ఉన్నప్పటికీ అమెరికాతో భారత్ వాణిజ్య స్నేహాన్ని ఏనాడు వద్దనుకోలేదు.. వదులుకోలేదు! అయితే.. ఇప్పుడు ట్రంప్ వ్యవహారమంతా... ‘మా ఇంటికి వస్తే ఏమి పట్టుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి పెడతారు’ అన్నట్లుగా మారిపోయింది. అమెరికా ఎగుమతులపై సుంకాలు ఎంత ఉండాలో తాను నిర్ణయిస్తున్నారు.. తమ దిగుమతులపై సుంకాలు ఎంత నిర్ణయించాలో కూడా తానే డిసైడ్ చేస్తున్నారు. అందుకు మోడీ ససేమిరా అంటున్నారు!

దీంతో... భారత్ ను బ్లాక్ మెయిల్ చేసే ఆలోచనతోనో.. లేక, పాకిస్థాన్ తమకు దగ్గరైతే, ఆ భయంతోనైనా భారత్ తాను చెప్పినమాట వింటుందనే వ్యూహంతోనో తెలియదు కానీ... "పాకిస్థాన్ కు ఐ లవ్ యూ" చెప్పే వరకూ వెళ్లారు ట్రంప్. ఇది అత్యంత దిగజారుడుతనం అనే కామెంట్లు వినిపిస్తున్నా.. అవి ట్రంప్ చెవి వరకూ చేరే అవకాశం లేదని చెబుతున్నారు. కారణం.. వైట్ హౌస్ గోడలు చాలా మందంగా ఉంటాయి!

ఏది ఏమైనా... అమెరికా – పాక్ మధ్య ఈ ప్రేమ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది వేచి చూడాలి. "పాకిస్థాన్ తో శత్రుత్వం ప్రమాదం.. స్నేహం ప్రాణాంతకం" అనే విషయం అమెరికా తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా వేచి చూడాలి. మరి ఈ "పాక్ ఐ లవ్ యూ"పై 9/11 బాధితుల కుటుంబాలు, అమెరికా పౌరుల రియాక్షన్ ఏమిటన్నది తెలియాల్సి ఉంది!