'అజ్ఞానమా.. అభద్రతాభావమా?'.. వ్యక్తి తప్పు చేస్తే వ్యవస్థను చంపేస్తున్న ట్రంప్!
ఈ క్రమంలో... ఇటీవల యూదు వ్యతిరేకంగా భావించే పోస్టులు పెట్టే వ్యక్తులకు వీసాలు, నివాస అనుమతులు రద్దు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.
By: Tupaki Desk | 23 May 2025 4:00 PM ISTడొనాల్డ్ ట్రంప్ తనను తాను చాలా సమర్ధవంతమైన వ్యక్తిగా చెప్పుకుంటారని అంటారు! కష్టం ఎవరిదైనా క్రెడిట్ తనకే కావాలని ప్రాకులాడతారని చెబుతుంటారు! పైగా ఇటీవల "అమెరికా ఫస్ట్" అనే నినాదాన్ని భుజాన్న వేసుకుని అక్కడున్న అంతర్జాతీయ విద్యార్థులపై కత్తికట్టారని చెబుతున్నారు. ఈ నేపథ్యలోనే.. ట్రంప్ ది అజ్ఞానమా.. అభద్రతాభావమా అని ప్రశ్నిస్తున్నారు.
అవును... అమెరికా ఈ ప్రపంచంలోనే అగ్రరాజ్యం! అలా అని అమెరికా అవసరం మాత్రమే ప్రపంచానికి ఉంటుంది కానీ, ప్రపంచ దేశాల అవసరం అమెరికాకు ఉండదని కాదు. ఆ విషయం తెలిసినప్పటికీ.. ప్రపంచం ముందు అనధికారిక నియంతలా ప్రవర్తిస్తున్నారు ట్రంప్ అనే విమర్శలు ఇటీవల వినిపిస్తున్నాయి. తన మాట వినని దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్నారు.
వాణిజ్యం విషయం కాసేపు పక్కనపెడితే... ఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం అగ్రరాజ్యానికి వెళ్తోన్న అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ కత్తి కట్టినట్లు ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు! ఈ క్రమంలో.. హెచ్1బీ వీసాదారులకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు నుంచి, పలువురు విదేశీ విద్యార్థులను బహిష్కరించడం వరకూ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
వాస్తవానికి ప్రతీ ఏడాది వేలాది మంది భారతీయులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉన్నత చదువుల కోసం లక్షలాది మంది ఎఫ్-1 విద్యార్థి వీసాలతోనూ, ఉజ్వల భవిష్యత్తు కోసం హెచ్1-బీ వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారనే సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో... ఇటీవల యూదు వ్యతిరేకంగా భావించే పోస్టులు పెట్టే వ్యక్తులకు వీసాలు, నివాస అనుమతులు రద్దు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో.. ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో స్థానం లేదని చెబుతూ... ఇప్పటివరకూ 300 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు తెలిపింది ట్రంప్ సర్కార్.
అలా.. తమ దేశానికి వెళ్లిన ఇతర దేశాలకు చెందిన విద్యార్థి తప్పు పొరపాటు చేస్తే మన్నించవచ్చు.. తప్పు చేస్తే శిక్షించవచ్చు.. నేరం చేస్తే దేశం నుంచి బహిష్కరించవచ్చు. అంతే కానీ... ఓ వ్యక్తో, ఓ సమూహమో తప్పుచేసిందని చెప్పి.. ఏకంగా వ్యవస్థ వ్యవస్థను చంపేసినంత పని చేయాలనుకోవడం ట్రంప్ కి మాత్రమే సాధ్యమైన పని అనే మాటలు తాజా నిర్ణయంతో వినిపిస్తున్నాయి.
తాజాగా.. హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకొంది. దీనిప్రకారం... హార్వర్డ్స్ లో అడ్మిషన్స్ పొందిన భారతీయులు సహా, విదేశీ విద్యార్థులు మరో వర్సిటీకి బదిలీకావాల్సి ఉంటుంది. అలాకానిపక్షంలో.. అమెరికాలో చట్టపరమైన హోదా కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ మేరకు యూనివర్సిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొనసాగిస్తోన్న దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయమని తెలిపింది. ఇదే సమయంలో.. క్యాంపస్ లో యూదు విద్యార్థులపై దాడి చేయడానికి అనుమతించడం ద్వారా హార్వర్డ్ అసురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించింది. హార్వర్డ్స్ చైనీస్ కమ్యునిస్ట్ పార్టీతో సమన్వయం చేసుకుంటోందని ఆరోపించింది.
ఇది హార్వర్డ్స్ లో అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి చెప్పిన కారణం. ఇక్కడే ట్రంప్ నిర్ణయాల్లోని ఢొల్లతనం.. ఆలోచనల్లోని అజ్ఞానం భయటపడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తుతూ, కీలక అంశాలను ప్రస్థావిస్తున్నారు.
హార్వర్డ్స్ లో యూదు వ్యతిరేక కార్యక్రమాలకు తెరలేపుతున్నారని చెబుతున్న ట్రంప్ సర్కార్... నిషేధించబడిన అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇజ్రాయెల్ దేశస్తులు ఉండరా అనే విషయంపై ఎలాంటి సమాధానం ఇస్తుందని అడుగుతున్నారు. మరోపక్క చైనా కమ్యునిస్టు పార్టీతో సమన్వయం చేసుకుంటే.. అందుకు కారకులైన వర్సిటీ స్టాఫ్ ను పట్టుకుని శిక్షించాలి!
అంతే తప్ప.. అక్కడ చదువుకుంటున్న సుమారు 140 దేశాలకు చెందిన విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏమిటి? పలువురి భవిష్యత్తును బలివ్వడం ఏమిటి? అంటే... ట్రంప్ ప్రభుత్వం తన దేశంలోని వర్సిటీ పెద్దలు, పక్క దేశంలోని పార్టీలతో సమన్వయం చేసుకుంటే.. వారిని నిరోదించే, పట్టుకుని శిక్షించలేనంత చేతకాని స్థితిలో ఉందా?
ఒక మాస్టారు సరిగా పాఠం చెప్పకపోతే, నలుగురు విద్యార్థులు క్రమశిక్షణగా లేకపోతే.. స్కూలు మూసేయాలనే నిర్ణయం ఎంత మూర్ఖత్వమో.. ఒక విదేశీ ఉద్యోగి తప్పు చేశాడని స్వదేశంలోని సొంత సంస్థను మూసేయడం ఎంత అజ్ఞానమో.. ఇదీ అలాంటిదే అనే కామెంట్లు ఇప్పుడు ట్రంప్ సర్కార్ సొంతం చేసుకుంటుంది. ప్రధానంగా హార్వర్డ్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పునపరిశీలించాలనే సూచనను తీసుకుంటుంది.
