కొడుకుకు సీటు ఇవ్వలేదు.. హార్వర్డ్ పై ట్రంప్ కోపానికి కారణం అదే!
హార్వర్డ్ విశ్వవిద్యాలయం బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోతలు విధించడం, తాజాగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేయడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 28 May 2025 2:00 PM ISTహార్వర్డ్ విశ్వవిద్యాలయం బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోతలు విధించడం, తాజాగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేయడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కుమారుడు బారన్‌కు ఆ విశ్వవిద్యాలయంలో సీటు నిరాకరించడం వల్లే ట్రంప్ ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ట్రంప్ చిన్న కుమారుడు బారన్‌కు హార్వర్డ్, కొలంబియా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో అతను న్యూయార్క్ యూనివర్సిటీ (NYU) స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ చదవడానికి అడ్మిషన్ తీసుకున్నట్లు పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు యూనివర్సిటీలో సీటు ఇచ్చిన హార్వర్డ్.. బారన్‌కు మాత్రం నిరాకరించడంతో అందుకు ప్రతీకారంగానే ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని వారు సోషల్ మీడియాలో విస్తృతంగా రాసుకొచ్చారు.
అయితే ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖండించింది. అంతేకాకుండా బారన్‌పై వస్తున్న వార్తలపై డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా కార్యాలయం స్పందిస్తూ బారన్ అసలు హార్వర్డ్‌కు దరఖాస్తే చేయలేదని వివరణ ఇచ్చింది. దీంతో ఈ ప్రచారం నిరాధారమైనదని స్పష్టమైంది.
ఇదిలా ఉండగా ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నిధుల్లో ట్రంప్ కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ విశ్వవిద్యాలయం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నామని, ఆయా దేశాలు విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలకు, ఆయన కుమారుడికి సీటు నిరాకరణకు ఎటువంటి సంబంధం లేదని తేలింది.
