Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా జీతాలు ఇవే.. సంచలనంగా మారిన రిపోర్ట్..

ప్రపంచం మొత్తం ట్రంప్ పాలనపైనే చర్చించుకుంటోంది. టారీఫ్ లు, హెచ్-1బీ వీసాకు కోటి రూపాయలు చెల్లించాలన్న నిబంధనలు ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   24 Sept 2025 3:15 PM IST
మైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా జీతాలు ఇవే.. సంచలనంగా మారిన రిపోర్ట్..
X

ప్రపంచం మొత్తం ట్రంప్ పాలనపైనే చర్చించుకుంటోంది. టారీఫ్ లు, హెచ్-1బీ వీసాకు కోటి రూపాయలు చెల్లించాలన్న నిబంధనలు ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ పై ట్రంప్ చర్యలు మరింత దూకుడుగా ఉన్నాయి. మొన్నటికి మొన్న భారత్ నుంచి అమెరికా వెళ్లే.. అక్కడ ఉంటున్న వారి హెచ్-1బీ వీసాకు చెల్లించే డాలర్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం పెద్ద పెద్ద టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ పై కూడా పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దేశీయ టాలెంట్ ను ప్రోత్సహించడం లేదు..

దేశీయ టాలెంట్ ను ప్రోత్సహించడం లేదంటూ అమెరికన్లు వాపోతున్నారని వారి కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా చెప్పుకస్తోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పెద్ద పెద్ద సాలరీలు తీసుకుంటున్న వారు అందరూ విదేశీయులేనని అక్కడి వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మైక్రోసాఫ్ట్ దాఖలు చేసిన హెచ్-1బీ వీసా డేటా ఆ వివాదంలో ఆజ్యం పోసిందనే చెప్పాలి. అయితే మైక్రోసాఫ్ట్ తమ సంస్థ అందజేస్తున్న సాలరీలను బయటపెట్టింది. ఈ డేటా కంపెనీ స్థితిని మాత్రమే కాకుండా, మొత్తం టెక్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న టాలెంట్ వార్ ను ప్రతిభింబిస్తుంది.

ఆయా రంగాల్లో ప్రతిభ పెంచుకోవాలి..

2025లో మైక్రోసాఫ్ట్ 9 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. విదేశీ ప్రతిభను ఆకర్షించేందుకు AI, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత జీతాలను ఆఫర్ చేస్తోంది. ఒకవైపు డౌన్‌సైజింగ్ జరుగుతుంటే.. మరోవైపు కొత్త ప్రతిభను ఆహ్వానించడం వ్యతిరేకతకు దారితీస్తుంది. ఇది కంపెనీ వ్యూహాత్మక అవసరమని కంపెనీ చెప్పుకస్తుంది. టెక్ రంగంలో ప్రపంచ స్థాయి పోటీ ఎదుర్కునేందుకు సూపర్ స్కిల్స్ ఉన్న ఇంజినీర్లు తప్పనిసరి అవసరం అవుతారు.

సాలరీల వెనుక ఉన్న సందేశం

మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు $284,000 (రూ. 2,52,03,670.51) వరకు జీతం చెల్లిస్తోంది. ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఇది $275,000 (రూ. 2,44,04,962.64) వరకు వెళ్తుంది. అదే డేటా సైన్స్‌ రంగంలో, మౌంటెన్ వ్యూ లోని ఒక డేటా సైంటిస్టు జీతం $274,500 (24360589.98) వరకూ ఉండడం గమనార్హం. కంపెనీకి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన AI, డేటా అనలిటిక్స్ వంటి రంగాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తోంది. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో కూడా గణనీయమైన వేతనాలు ఉన్నాయి. రెడ్‌మండ్‌లో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ జీతం $250,000 (22186329.68) చేరుకోవడం, మేనేజ్‌మెంట్ లేయర్‌లోనూ టాలెంట్‌ను దక్కించుకోవడంపై కంపెనీ దృష్టి ఉందని తెలుస్తోంది.

స్వదేశీ, విదేశీ సంతులనం

అమెరికాలో తరచూ ఒక వాదన వినిపిస్తోంది. ‘టాప్ కంపెనీలు విదేశీయులను తీసుకోవడం వల్ల స్థానికులకు అవకాశాలు తగ్గుతున్నాయి’ అని. అయితే మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన ఈ డేటా తర్వాత మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఈ వేతనాలు సాధారణ స్థాయి ఉద్యోగులకు సంబంధించినది కాదు.. అత్యంత నైపుణ్యం, అనుభవం, ప్రాజెక్ట్ లీడర్‌షిప్‌ నకు అవసరమయ్యే ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే. ప్రపంచం మొత్తం సేవలందించే టెక్ సంస్థలు ఇంత పెద్ద పెద్ద పోస్టుల్లో కేవలం స్థానికులతో నింపలేవు. అందువల్లే మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభను ఆహ్వానిస్తోంది.

టెక్ రంగంలో విప్లవాత్మక మార్పు..

కొన్నేళ్లుగా ఏఐ ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది. చాట్ జీపీటీ వంటి ఉత్పత్తులు, జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ ఆల్ ఈ మార్పులను వేగవంతం చేశాయి. మైక్రోసాఫ్ట్‌ గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్‌ వంటి కంపెనీలలో వారి ప్రత్యర్థులతో తీవ్రంగా పోటీ ఉన్నందున అత్యున్నత ప్రతిభ ఉన్న వ్యక్తులను కంపెనీలు ఎంత డబ్బయినా పెట్టి హైర్ చేసుకుంటున్నాయి. జీతాల పరంగా వెనుకబడితే, ఉత్తమ ప్రతిభ సులభంగా పోటీదారుల వైపు వెళ్తుందని వారు అంటున్నారు. కాబట్టి భారీ వేతనాలు చెల్లించడం మైక్రోసాఫ్ట్‌కు ఒక ఖర్చు కాకుండా పెట్టుబడిగా భావించవచ్చు.

ఉద్యోగులపై ప్రభావం..

తొలగింపులు ఎదుర్కొన్న వారు లేదంటే.. తక్కువ జీతంతో పని చేస్తున్న వారు ఈ డేటా చూసి నిరుత్సాహపడే అవకాశం ఉంది.

మరోవైపు, మైక్రోసాఫ్ట్‌తో పనిచేయాలని కలలు కనే ప్రతిభావంతులైన ఇంజినీర్లకు ఇది ఒక మోటివేషన్‌గా మారుతుంది.

మైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా జీతాల వెల్లడి ఒక సాధారణ డేటా కాదు. ఇది గ్లోబల్ టెక్ మార్కెట్లో ప్రతిభ ఉన్న ఉద్యోగుల కోసం పోటీకి అద్దం పట్టింది. అమెరికాలో వలసలపై, ఉద్యోగాలపై వివాదం ఎంత కొనసాగినా, టెక్ ప్రతిభకు సరిహద్దులు లేవు అనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఈ విషయాన్ని ఒడిసి పట్టుకున్నాయి. మిగతా టెక్ దిగ్గజాలు కూడా ఇదే మార్గంలో నవడం తప్పదు. కాబట్టి ఈ డేటా కంపెనీ వేతనాల వివరాలకే పరిమితం కాదు. ఉద్యోగ మార్కెట్ ఎటు వైపు ఉందో తెలుసుకునేందుకు దిశా నిర్ధేశంగా భావించవచ్చు.