Begin typing your search above and press return to search.

అమెరికా 'గోల్డెన్ డోమ్' క్షిపణి రక్షణ ప్రాజెక్టు కథేంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం $175 బిలియన్ల భారీ వ్యయంతో 'గోల్డెన్ డోమ్' క్షిపణి రక్షణ ప్రాజెక్టును ప్రకటించారు.

By:  Tupaki Desk   |   21 May 2025 10:32 AM IST
అమెరికా గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ ప్రాజెక్టు కథేంటి?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం $175 బిలియన్ల భారీ వ్యయంతో 'గోల్డెన్ డోమ్' క్షిపణి రక్షణ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నాయకత్వం వహించడానికి అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గెట్లైన్‌ను నియమించారు. ఈ ప్రాజెక్టును "మాన్హాటన్ ప్రాజెక్టు స్థాయిలో" విస్తృతంగా అభివృద్ధి చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ ప్రకటనలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు జనరల్ గెట్లైన్ కూడా ఉన్నారు. ట్రంప్ మాట్లాడుతూ ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థ మూడు సంవత్సరాల్లో పూర్తవుతుందని, అమెరికా ఖండంలోని మొత్తం ప్రాంతాన్ని — కెనడాను కూడా కలుపుకొని వైమానిక ముప్పుల నుంచి రక్షించగలదని తెలిపారు. "ఇది అమెరికాకు ఒక గొప్ప రోజు," అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రకటన సమయంలో ఆయన వెనుక అమెరికా ఖండాన్ని బంగారు రంగులో చూపిస్తూ, క్షిపణులను అడ్డుకుంటున్న దృశ్యాలతో కూడిన ఒక పోస్టర్ ఉంచారు.

ఈ గోల్డెన్ డోమ్ ప్రణాళిక అంతరిక్ష ఆధారిత శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, అంతరిక్షం నుంచైనా వచ్చే క్షిపణులను గుర్తించి అడ్డగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అమెరికాలో ఇప్పటికే ఉన్న రక్షణ వ్యవస్థలతో సమన్వయంగా పని చేస్తుందని ట్రంప్ చెప్పారు.

ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' నుండి 'గోల్డెన్ డోమ్' దిశగా..

ప్రారంభంలో ‘అమెరికా కోసం ఐరన్ డోమ్’గా ప్రకటించిన ఈ ప్రాజెక్టును, తరువాత ఫిబ్రవరిలో పెంటగాన్ 'గోల్డెన్ డోమ్'గా పేరు మార్చింది. దీనికి కారణం ఇజ్రాయెల్ యొక్క 'ఐరన్ డోమ్' బ్రాండ్‌పై ఉన్న ట్రేడ్‌మార్క్ హక్కులు కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

-ధరపై చర్చ, సాంకేతిక సందేహాలు

ఈ ప్రాజెక్టు ఖర్చు $175 బిలియన్లు అని ట్రంప్ చెప్పినప్పటికీ, గతంలో అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం దీని వ్యయం 20 ఏళ్ల కాలంలో $161 బిలియన్ల నుండి $542 బిలియన్ల వరకు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. 2012లో జాతీయ పరిశోధనా మండలి చేసిన అధ్యయనం ప్రకారం ఇది పూర్తిగా అమలవుతే ఖర్చు $831 బిలియన్ల (2025 విలువల ప్రకారం) దాటే అవకాశం ఉంది. మొంటానా రాష్ట్ర రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ మాట్లాడుతూ, ఇది పూర్తిగా అమలైతే ట్రిలియన్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

- సాంకేతిక నిపుణుల ఆందోళనలు

ఇజ్రాయెల్‌లో వినియోగంలో ఉన్న 'ఐరన్ డోమ్' చిన్న పరిమాణంలో, తక్కువ శ్రేణి క్షిపణులను అడ్డుకునే విధంగా ఉంది. కానీ అమెరికా భూభాగం దాదాపు 400 రెట్లు పెద్దది కావడంతో, అలాంటి వ్యవస్థను అమెరికాలో అన్వయించడంలో సాంకేతిక పరంగా చాలా సవాళ్లు ఉన్నాయని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.

- ప్రధాన కాంట్రాక్టర్లు & వ్యతిరేకతలు

స్పేస్ ఎక్స్ (ఎలన్ మస్క్), పాలంటిర్, ఆండ్రిల్, వంటి ప్రముఖ సంస్థలు శాటిలైట్ ఆధారిత భాగాలను తయారుచేయడానికి పోటీపడుతున్నాయి. అయితే అంతరిక్షాన్ని ఆయుధాలుగా మారుస్తే అంతర్జాతీయ ఒప్పందాలపై ప్రభావం చూపుతుందని, కొత్త ఆయుధ పోటీకి దారి తీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. యూనియన్ ఆఫ్ కన్సర్డ్ సైంటిస్ట్ సంస్థ డైరెక్టర్ లారా గ్రెగో మాట్లాడుతూ “ఇది ఒక కల్పిత కల” అని వ్యాఖ్యానించారు. గతంలో చేసిన అంతరిక్ష క్షిపణి రక్షణ ప్రణాళికలు ఖరీదుతో పాటు సాంకేతికంగా కష్టమైనవని, సులభంగా ఎదుర్కొనేలా ప్రత్యర్థులు వ్యూహాలు రూపొందించగలరని తెలిపారు.

గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు అమెరికా రక్షణ రంగంలో పెద్ద అడుగుగా కనిపిస్తున్నప్పటికీ, దీని విజయాన్ని నిర్ధారించే అంశాలు సవాళ్లతో కూడి ఉన్నాయి. దీని వ్యయం, సాంకేతికత, అంతర్జాతీయ చట్టాలు అన్నీ గణనీయంగా పరిశీలించాల్సినవే. ఇది ఒక దౌత్య ప్రయోగంగా మారుతుందా, లేక భవిష్యత్తులో వ్యర్థ పెట్టుబడిగా మిగులుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.