యుద్ధాన్ని అంతరిక్షానికి తీసుకెళ్లనుంది... ఏమిటీ 'గోల్డెన్ డోమ్'?
అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. గోల్డెన్ డోమ్ గా చెబుతోన్న ఈ రక్షణ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించలేదు.. ఏ అణ్వాయుధమూ సమీపించలేదు!
By: Tupaki Desk | 22 May 2025 3:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఓ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ.15 లక్షల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ గోల్డెన్ డోమ్ గురించిన చర్య విపరీతంగా నడుస్తోంది!
అవును... అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. గోల్డెన్ డోమ్ గా చెబుతోన్న ఈ రక్షణ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించలేదు.. ఏ అణ్వాయుధమూ సమీపించలేదు! ఇది భూమిపైనే కాదు, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచి రక్షణ కల్పించే వ్యవస్థ.
దీని నిర్మాణానికి ప్రస్తుతం $ 25 బిలియన్లు కేటాయించగా.. మొత్తం నిర్మాణానికి $ 175 బిలియన్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన జనరల్ మైఖేల్ గుట్లిన్ పర్యవేక్షించనున్నారు. ఈ డోమ్ నిర్మాణం తన పదవీకాలం (2029) ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి 20 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం చేయడం వెనుక రష్యా, చైనా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాలను ఎదుర్కొనే ఉద్దేశ్యమే ఉందని అంటున్నారు! ప్రస్తుతం ఈ రెండు దేశాలు అత్యాధునిక క్షిపణులను రూపొందించాయి. వీటిని పక్కాగా ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని అమెరికా రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే... ఈ గోల్డెన్ డొమ్ ప్రాజెక్టును చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా.. ఈ వ్యవస్థ తీవ్రస్థాయిలో అస్థిరత సృష్టిస్తుందని, అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఈ రెండు దేశాలు పేర్కొంటున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ డోమ్ విషయం పుతిన్ కు ఇంకా చెప్పలేదని.. సరైన సమయంలో చెబుతానని చెప్పడం గమనార్హం!
